మత విద్వేషాలు రెచ్చ గొడుతున్న మోదీ : తుమ్మల నాగేశ్వరరావు 

మత విద్వేషాలు రెచ్చ గొడుతున్న మోదీ : తుమ్మల నాగేశ్వరరావు 

భద్రాచలం, వెలుగు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. మహబూబాద్ పార్లమెంట్​కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ గురువారం భద్రాచలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితులను మోదీ చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ప్రధాని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆమెను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్​తో కమ్యూనిస్టులు జత కడితే ప్రత్యర్థులకు చుక్కలేనని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయతీలు తిరిగివస్తేనే  భద్రాచలం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భద్రాచలం నియోజకవర్గం లో పెండింగ్​లో ఉన్న మోడికుంట ప్రాజెక్ట్, ప్రగులపల్లి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారిని, భద్రాచలం మిగిలిన అసంపూర్తి కరకట్టను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పలువురు లీడర్లు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

భద్రాచలం పేరు మార్మోగేలా చేస్తాం

అయోధ్య మాధిరిగా భద్రాచలం పేరును దేశంలో మార్మోగేలా కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. భద్రాచలంలోని జ్ఞాన మందిరం గుట్టపై నుంచి రామాలయం వ్యూ పాయింట్ ​నుంచి పరిశీలించారు. రామాలయంలో అధికారులతో మాట్లాడుతూ శ్రీసీతారామచంద్రస్వామి టెంపుల్​ డెవలప్​మెంట్​ కోసం అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఏడాదిలోగా టెంపుల్​ను సుందరంగా తీర్చి దిద్దుతామని చెప్పారు. సీతారాముల కల్యాణం చేసే  మిథిలా స్టేడియం వద్ద సోలార్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సీనియర్ నాయకులు రసూల్, యశోద రాంబాబు తోటకూరి రవిశంకర్ పాల్గొన్నారు.