సెల్ ఫోన్ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌.. హైదరాబాద్ లో ఒక్కరోజే 1,340 కేసులు

సెల్ ఫోన్ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌.. హైదరాబాద్ లో ఒక్కరోజే 1,340 కేసులు

మల్కాజిగిరి, వెలుగు: డ్రైవింగ్ చేస్తూ సెల్​ఫోన్ వినియోగిస్తున్న వాహనదారులపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తొలి రోజే మొత్తం 1,340 కేసులు నమోదు చేసి, రూ.13,39,000 జరిమానా విధించారు. 

డ్రైవింగ్ సమయంలో మొబైల్​లో మాట్లాడటం, మెసేజ్​లు పంపడం, వీడియోలు చూడటం వంటి ప్రమాదకర చర్యల వల్ల డ్రైవర్లతో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. 

అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో నిలిపి మాత్రమే ఫోన్ మాట్లాడాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.