ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు: నీతి ఆయోగ్

 ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు: నీతి ఆయోగ్

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా 2015–16 నుంచి 2019–21 మధ్య పేదరికం బాగా తగ్గిందని నీతి ఆయోగ్‌‌  తెలిపింది. ‘నేషనల్‌‌ మల్టీ డైమెన్షనల్‌‌  పావర్టీ ఇండెక్స్‌‌: ఎ ప్రోగ్రెస్‌‌  రివ్యూ 2023’రిపోర్ట్ ను నీతి ఆయోగ్  సోమవారం విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం... దేశవ్యాప్తంగా ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. సోమవారం నీతి ఆయోగ్‌‌  సభ్యులు డాక్టర్‌‌  వీకే పాల్, డాక్టర్‌‌  అరవింద్‌‌  వీరమణి, నీతి ఆయోగ్‌‌  సీఈఓ బీవీఆర్‌‌  సుబ్రహ్మణ్యం సమక్షంలో నీతి ఆయోగ్‌‌  వైస్‌‌ చైర్మన్‌‌  సుమన్‌‌  బేరీ ఈ నివేదికను విడుదల చేశారు. జాతీయ బహుమితీయ పేదరిక సూచిక (నేషనల్  మల్టీడైమెన్షనల్  పావర్టీ ఇండెక్స్, ఎన్ఎంపీఐ) లోని 12 అంశాలు, నేషనల్‌‌  ఫ్యామిలీ  హెల్త్‌‌ సర్వే డేటా ఆధారంగా నీతి ఆయోగ్‌‌ ఈ నివేదికను తయారు చేసింది. 

స్యూల్ ఎడ్యుకేషన్, పారిశుద్ధ్యం, వంటచెరకు పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయని నీతి ఆయోగ్  ఆ రిపోర్టులో వివరించింది. గత రికార్డులతో పోలిస్తే పేదరికం 24.85 శాతం నుంచి 14.96 శాతానికి తగ్గిందని పేర్కొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి క్షీణించిందని తెలిపింది. క్షేత్ర స్థాయిలో మొత్తం 12 జాతీయ బహుమితీయ పేదరిక సూచిక (ఎన్ఎంపీఐ) సూచీల్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని నీతి ఆయోగ్  వివరించింది. ఇక పేదరికం క్షీణించిన రాష్ట్రాల్లో 3.43 కోట్లతో యూపీ తొలి స్థానంలో ఉండగా.. బీహార్, మధ్యప్రదేశ్  వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది. 

తెలంగాణలోనూ పేదరికం తగ్గుదల

2015–16 నుంచి 2019–21 మధ్య తెలంగాణలో 27,61,201 మంది ప్రజలు బహుమితీయ పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్  వెల్లడించింది. తెలంగాణలో పేదవారి శాతం 13.18 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గిందని వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో 19.51 శాతం నుంచి 7.51 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.92 శాతం నుంచి 2.73 శాతం మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. 33 జిల్లాల్లో అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌  జిల్లాలో 16.59 శాతం, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 2.17 శాతం మంది పేదలు ఉన్నారు. రాజధాని హైదరాబాద్ లో 2.52 శాతం మంది, రంగారెడ్డిలో 3.83 శాతం మంది పేదలు ఉన్నారు.

2015–16 లో ఆదిలాబాద్ లో 27.12 శాతం మంది పేదలు ఉంటే, 2019–2021కి వారు 14.24 శాతానికి, నిజామాబాద్​లో 21.06 శాతం నుంచి 6.76కు, మెదక్ లో 17.87 శాతం నుంచి 9.34కు, ఖమ్మంలో 13.75 శాతం నుంచి 3.18కి, నల్గొండలో 13.35 శాతం నుంచి 4.40కు, కరీంనగర్ లో 8.65 శాతం నుంచి 2.50కు, హైదరాబాద్ లో 4.21 శాతం నుంచి 2.52 శాతానికి పేదలు తగ్గారని నీతి ఆయోగ్  వివరించింది.