మోదీ ఏమైనా జ్యోతిష్యుడా? ప్రధాని కామెంట్లకు ప్రియాంక కౌంటర్

మోదీ ఏమైనా జ్యోతిష్యుడా? ప్రధాని కామెంట్లకు ప్రియాంక కౌంటర్

 న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఏమైనా జ్యోతిష్యుడా అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్​లో కాంగ్రెస్​కు ఒక్క సీటు కూడా రాదని, ఆ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని మోదీ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ‘‘నేనైతే జ్యోతిష్యురాలిని కాదు.. ప్రధాని మోదీ ఏమైనా జ్యోతిష్యుడేమో చెప్పాలి” అని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో గమనించండి.

రెండింటినీ పోల్చి చూడండి. ఆ తర్వాత ఆలోచించి ఓటు వేయండి” అని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. అలాంటి పార్టీని ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజలతో తమకు మంచి అనుబంధం ఉందని, అది ప్రతి సభలోనూ కనిపిస్తున్నదని పేర్కొన్నారు. అమేథీ ప్రజలకు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిందేమీ లేదని, ఆమె కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అమేథీకి వచ్చారని ప్రియాంక గాంధీ విమర్శించారు.