సోషల్ మీడియా.. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు.. అందరూ ఫోన్లో మునిగిపోతున్నారు. దీని వల్ల రాబోయే తరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే.. భూమిపై ఫస్ట్ ఆస్ట్రేలియా దేశం స్పందించింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసింది. వాళ్లకు ఇచ్చే ఫోన్లు, ట్యాబుల్లో సోషల్ మీడియా రాకుండా విధివిధానాలు రూపొందించి.. పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరం చేస్తోంది. ఇదే తరహాలో.. ఇండియా వస్తుంది.. ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా.. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు వైరల్ అవుతున్నాయి.. మధురై కోర్టు బెంచ్ ఏమని వ్యాఖ్యలు చేసిందో తెలుసుకుందామా..
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా మాదిరిగా చిన్న పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంటర్నెట్లో చిన్న పిల్లలకు అశ్లీల కంటెంట్ యాక్సెస్ లేకుండా ఆయా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఎస్. విజయకుమార్ 2018లో మధురై బెంచ్‌లో ప్రజా ప్రయోజనం వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో లభ్యమయ్యే అశ్లీల కంటెంట్‌తో మైనర్లు పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ల సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ చర్యలు తీసుకునేలా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, తమిళనాడు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త చట్టం తీసుకురావడాన్ని పరిశీలించాలని సూచించింది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఓ కన్నేసి ఉంచాలని సూచన చేసింది.
అధికారులు కూడా దీనిపై అవగాహన ప్రచారం చేయాలని సూచించింది. ఆస్ట్రేలియా తరహాలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించే చట్టం రూపొందించాలని మద్రాస్ హైకోర్టు పేర్కొనడంతో కొత్త చర్చ ప్రారంభమైంది. మద్రాస్ హైకోర్టు సలహాతో ఇండియాలో కూడా ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకు వస్తుందా అనే టాక్ నడుస్తోంది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ఇండియాలో కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకురావాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కఠిన చట్టాలతో పిల్లలు చిన్నతనంలో పక్కదారి పట్టకుండా కాపాడొచ్చంటున్నారు.
