హెచ్-1బీ వీసా కష్టాలు: అమెరికా ముందు భారత్ ఆందోళన

హెచ్-1బీ వీసా కష్టాలు: అమెరికా ముందు భారత్ ఆందోళన

అమెరికా హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్ల షెడ్యూలింగ్‌లో జరుగుతున్న విపరీతమైన జాప్యం, ఆకస్మిక రద్దులపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వేలాది మంది భారతీయ నిపుణులు, విద్యార్థులు ఈ సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ, వాషింగ్టన్‌లోని అమెరికా అధికారులతో ఈ విషయంపై చర్చించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం అమెరికా వీసా ప్రక్రియలో నెలకొన్న అనిశ్చితి వల్ల భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాల్సి రావడం, క్షుణ్ణమైన తనిఖీల వల్ల ప్రక్రియ నెమ్మదించింది. దీనివల్ల గతంలో కొన్ని వారాల్లో పూర్తయ్యే స్టాంపింగ్ ప్రక్రియ ఇప్పుడు ఏకంగా 2026 వరకు రీషెడ్యూల్ అవుతున్నాయి. ఈ జాప్యం వల్ల వందలాది మంది టెక్కీలు సెలవులపై భారత్‌కు వచ్చి, తిరిగి వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు.

కేవలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులు (H-4).. ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు కూడా ఈ జాప్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. అనేక మందికి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉండగా, విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ భారతీయ ఉద్యోగులకు వీసా స్టాంపింగ్ లేనిదే ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే అంతర్గత హెచ్చరికలు జారీ చేశాయి.

ALSO READ : సగం ధరకే ఐఫోన్ 14.. ఎక్కడో తెలుసా?

వీసా మంజూరు అనేది పూర్తిగా అమెరికా సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం అయినప్పటికీ, భారతీయుల ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ కోరుతోంది. అమెరికా రాయబార కార్యాలయం అదనపు సిబ్బందిని నియమించి లేదా స్లాట్ల సంఖ్యను పెంచి ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు. భారత ప్రభుత్వం నిరంతరం అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.