కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా కంపెనీని అమ్మేసినప్పుడు వచ్చే భారీ లాభాలను యజమానులు లేదా వాటాదారులు మాత్రమే పంచుకుంటారు. కానీ అమెరికాకు చెందిన ఒక బాస్ తన ఉదారతతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. తన కంపెనీని అమ్మగా వచ్చిన లాభాల్లో ఏకంగా రూ.2వేల 250 కోట్లను తన వద్ద పనిచేసే 540 మంది ఉద్యోగులకు బహుమతిగా అందించి రియల్ లైఫ్ 'శాంటా క్లాజ్' అనిపించుకున్నారు.
అమెరికాలోని లూసియానాకు చెందిన గ్రాహం వాకర్ 'ఫైబర్‌బాండ్' అనే మౌలిక సదుపాయాల తయారీ సంస్థకు సీఈఓగా ఉండేవారు. ఇటీవల ఈ కంపెనీని 'ఈటన్' అనే గ్లోబల్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీకి సుమారు రూ.15వేల 300 కోట్లకు అమ్మాడు.
కంపెనీ అమ్మకం సమయంలో గ్రాహం వాకర్ ఒక అసాధారణ షరతు పెట్టారు. సేల్ ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతం తన ఉద్యోగులకు పంచాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రతి ఉద్యోగికి రూ.4 కోట్లు పంచిపెట్టాడు సదరు సీఈవో. విశేషమేమిటంటే ఈ ఉద్యోగులకు కంపెనీలో ఎలాంటి షేర్లు కూడా లేవు. చాలా కాలంగా కంపెనీ కోసం విశ్వాసంగా పనిచేసిన దానికి ప్రతిఫలంగానే వాకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
►ALSO READ | కొత్త చరిత్ర సృష్టించిన గోల్డ్.. 24 గంటల్లో ఆల్ టైం హైకి చేరిన బంగారం.. ఎందుకంటే..?
1980ల్లో వాకర్ తండ్రి స్థాపించిన ఈ కంపెనీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 1990ల్లో ఫ్యాక్టరీ కాలిపోయినప్పుడు, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లలేదు. తాను కేవలం పడవను నడుపుతున్నానని.. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్తోంది తన టీమ్ మాత్రమేనంటారు వాకర్. అందుకే వారు లేకపోతే తమ ఫ్యామిలీ బిజినెస్ కి ఉనికి లేదని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ బోనస్ డబ్బుతో చాలా మంది ఉద్యోగులు తమ హోమ్ లోన్స్ తీర్చుకున్నారు, పిల్లల చదువులకు వెచ్చించారు. మరికొందరు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నారు.
