- యూపీ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో మర్ద్ (ఎంఏఆర్డీ)
- మగాళ్ల సమస్యలు హైలైట్ చేసేందుకు పోటీ: పార్టీ చీఫ్ కపిల్
- డొమెస్టిక్ వయెలెన్స్, వరకట్న నిషేధ చట్టాల్లో లోపాలున్నట్లు వెల్లడి
లక్నో: మహిళా హక్కుల పోరాటాల లాగే.. పురుషుల హక్కుల కోసం కూడా దేశంలో మేరా అధికార్ రాష్ట్రీయ దళ్(మర్ద్) రాజకీయ పార్టీ పని చేస్తున్నది. పురుషులు కూడా వేదన అనుభవిస్తారు(మర్ద్ కో దర్ద్ హోతా హై) అనేది ఆ పార్టీ ట్యాగ్‌లైన్. డొమెస్టిక్ వయెలెన్స్, వరకట్న నిషేధం, మహిళల రక్షణ చట్టాల్లో లోపాల వల్ల మగవాళ్లు చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ చెప్తున్నది. పురుషులకూ హక్కులుండాలని 2009లో ఈ పార్టీని స్థాపించినట్లు వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ అధ్యక్షుడు కపిల్ మోహన్ చౌదరి తెలిపారు.1999 నుంచి వరకట్న వేధింపుల కేసును ఎదుర్కొంటున్నానని, 25 ఏండ్లుగా అది తేలడంలేదని చౌదరి అన్నారు. తనలా ఇబ్బందులు పడుతున్న చాలా మందిని కలిశానని వారందరితో కలిసి పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
2019 ఎన్నికల్లో పోటీ..
మగాళ్ల హక్కులు, సమస్యలను హైలైట్ చేయడం కోసం 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి, లక్నో నుంచి, 2020లో బంగార్‌మౌ ఉప ఎన్నిక, బరేలీ, లక్నో నార్త్, బక్షి కా తలాబ్ (లక్నో) లో ఎంఏఆర్డీ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో లక్నో, గోరఖ్‌పూర్, రాంచీలో ఎంఏఆర్డీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్టీ చీఫ్ కపిల్ మోహన్ లక్నో నుంచి బరిలో నిలిచారు. పార్టీ మేనిఫెస్టోలో ‘‘పురుషుల సంక్షేమ మంత్రిత్వ శాఖ”, ‘‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్”వంటి హామీలు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాల వల్ల పురుషులకు అన్యాయం జరగొద్దని కపిల్ చెప్తున్నారు. పార్టీలో మహిళలు కూడా ఉన్నారని.. పురుషుల హక్కులను పరిరక్షించడమే లక్ష్యం తప్ప మహిళల హక్కులకు భంగం కలిగించడం కాదన్నారు.
