- 1969 ఉద్యమకారుల సంఘం నేతలు కిషన్ రావు, సుదర్శన్ రావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని 1969 ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు, సెక్రటరీ జనరల్ దుశ్చర్ల సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం బంజారాహిల్స్‌లో మీడియాతో మాట్లాడారు. 1948లో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవం తర్వాతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, అప్పటి నుంచి ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా 1969 ఉద్యమంలో పాల్గొన్నవారు అనేక మంది ఉన్నారని, వారిని అధికారికంగా గుర్తించాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఉద్యమకారులకు ప్రతి నెల పెన్షన్, ఇంటి జాగా ఇవ్వాలన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో తెలంగాణ అమరవీరుల స్మృతివనం ఏర్పాటు కోసం 100 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్లను కోరగా అంగీకరించారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నవారికి తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహన లేదని ఆరోపించారు. ఉద్యమ వాస్తవాలను కమిటీ తెలుసుకోవాలని సూచించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలన్నారు. త్వరలో అన్ని పార్టీల నాయకులను కలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు ఉపేందర్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
