వ్యాక్సిన్ డ్రైవ్‌‌లో భారత్ మరో ఘనత

వ్యాక్సిన్ డ్రైవ్‌‌లో భారత్ మరో ఘనత

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంటిన్యూ అవుతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏకంగా 200 కోట్లకు చేరుకోవడం విశేషం. నిన్న 25,59,840 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,99,98,89,707కు చేరింది. మరోవైపు.. దేశంలో 3,92,569 పరీక్షలు నిర్వహించగా.. 20 వేల 528 కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారి సంఖ్య 5,25,709కు చేరుకుంది. 17,790 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వైరస్ ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లుగా ఉంది. దేశంలో 1,43,449 యాక్టివ్ కేసులున్నాయి.

భారతీయులందరికీ అభినందనలు

200 కోట్ల కోవిడ్- 19 వ్యాక్సినేషన్‌లను పూర్తి చేసిన ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. " భారతదేశం మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల మార్క్ ను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగంతో అసమానంగా మార్చడానికి సహకరించిన వారికి గర్వకారణం. ఇది కోవిడ్- 19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసింది" అని ట్వీట్ చేశారు.