హైదరాబాద్, వెలుగు: రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెసలు, కందులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లపై కేంద్రం 25 శాతం పరిమితి విధించడం అన్యాయమన్నారు. మిగిలిన పంటలను రైతులు ఎక్కడ అమ్ముకోవాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్రంలో సాగవుతున్న మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్‌ఎస్ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధ హామీ కల్పించడంతోపాటు మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్ పరిధిలోకి తీసుకురావాలని, కొనుగోళ్లపై విధించిన 25 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం కలిగించే దిగుమతి విధానాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. రైతులను ఓటు బ్యాంకుగా కాకుండా దేశానికి వెన్నెముకగా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు.
