52 రోజుల ఆర్టీసీ సమ్మెలో 30 యాక్సిడెంట్లు

52 రోజుల ఆర్టీసీ సమ్మెలో 30 యాక్సిడెంట్లు

టెంపరరీ డ్రైవర్లు చంపేస్తున్నరు
లారీలు, ట్రక్కులు నడిపినోళ్లనే తీసుకున్నరు
సెంట్రల్ మోటార్ వెహికిల్ యాక్ట్‌ను పట్టించుకోలే

హైదరాబాద్, వెలుగు: రద్దీగా ఉండే సిటీ రోడ్లమీద లారీలు, టిప్పర్లు నడిపినట్టు ఆర్టీసీ బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే యాక్సిడెంట్లు పెరుగుతున్నయ్. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా గ్రేటర్ ఆర్టీసీ ఎవరిని పడితే వాళ్లను రిక్రూట్ చేసుకుంది. 52 రోజుల సమ్మె కాలంలో అనుభవం లేని డ్రైవర్లతో ప్రమాదాలు పెరగడంతో హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తాత్కాలిక డ్రైవర్ల కారణంగానే ప్రమాదాలు పెరిగాయని.. ఇది ప్రజల ప్రాణాలకు ప్రమాదమేనని తెలిపింది. మంగళవారం బర్కత్ పురాకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు 12లో స్కూటీని గుద్దింది. ఈ ఘటనలో సోహిని సక్సేనా (35) అక్కడికక్కడే చనిపోయింది. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన నాటి నుంచి గ్రేటర్‌లో దాదాపు చిన్న, పెద్ద ప్రమాదాలు 30కి పైగా జరిగినట్టు సమాచారం.

ఇష్టమున్నట్టు రిక్రూట్ మెంట్
ప్రజా రవాణాలో డ్రైవర్‌గా చేరటమనేది అంత సులభం కాదు. ఏపీ ట్రాన్స్ పోర్ట్, మోటార్ వెహికిల్ యాక్ట్, సెంట్రల్ మోటార్ వెహికిల్ యాక్ట్ -1988 ప్రకారం ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌గా చేరాలంటే కొన్ని నిబంధనలున్నాయి . హెవీ డ్రైవింగ్ లెసెన్స్ విత్ బ్యాడ్జ్ తో పాటు 8క్లాస్ పాసై ఉన్నవారిని డ్రైవర్లుగా తీసుకుంటారు. పేపర్ యాడ్ ద్వారా గానీ ఎంప్లాయిమెంట్ ఆఫీసులో నమోదు చేసుకున్న వారికి సమాచారం ఇస్తూ ఈ ప్రక్రియ చేపడుతారు. లైసెన్స్, క్వాలిఫికేషన్‌ని వెరిఫై చేసి, అంతా ఓకే అనుకున్నప్పుడు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ లో ప్రతి ఒక్కరికీ మెడికల్ టెస్ట్​ చేసి, ఫిజికల్ ఫిట్‌గా ఉన్నవారిని మాత్రమే ఆర్ఎంలకు రిఫర్ చేస్తారు . హెవీ డ్రైవింగ్ లెసెన్స్ ఉండి డ్రైవింగ్‌లో అనుభవమున్నా సరే ప్రతి ఒక్కరికీ హకీం పేట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఉంటుంది. రోజు 8 గంటల పాటు మూడు నుంచి 4 నెలలు సిటీలోని రద్దీ ఉండే ప్రాంతాలు ఇతర రోడ్లపై డ్రైవింగ్ శిక్షణ ఇస్తారు. తర్వాత థియారీ క్లాస్‌లలో రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్ వారు ఆర్ఎంలకు ఇచ్చే నివేదికను బట్టి డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.

కండక్టర్లకు కూడా..
కండక్టర్‌ని తీసుకోవటానికి కూడా శిక్షణ అనేది తప్పనిసరి. ముందుగా ఆర్టీవో నుంచి కండక్టర్ లెసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత జాన్సన్ అంబులెన్స్ సెంటర్ నుంచి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలన్నది కండక్టర్లకు తెలిసి ఉండాలి. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో మెడికల్ టెస్టుల తర్వాత ఆర్టీవో ఓరల్‌గా ఎగ్జామిన్ చేసి జాబ్ ఇస్తారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ చట్టానికి తూట్లు పొడించింది. ఎలాంటి నిబంధనలను అనుసరించకుండా వందలాది మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. హెవీ డ్రైవింగ్ లెసెన్స్ ఉన్న
వారిని డ్రైవర్‌గా నియమించారు. టెన్త్ పాస్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లను కండక్టర్లుగా తీసుకున్నారు. మోటార్ వెహికిల్ ఇన్‌స్పె క్టర్లు, ఆర్టీఓలే డ్రైవర్లను సెలెక్ట్ చేశారు. వాస్తవానికి వీరికి ఆ అధికారం లేదు. ప్రభుత్వం చేపట్టిన నియమాకలన్నీ నిబంధనల ఉల్లం ఘనలే. నేర చరిత్ర ఉన్నవాళ్లు, ప్రమాదాలకు పాల్పడినవారిని కూడా డ్రైవర్లుగా నియమించారన్న ఆరోపణలున్నాయి . గ్రేటర్ పరిధిలో అవసరమైనంత మంది డ్రైవర్లు పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవటంతో కొందరిని బలవంతంగా రిక్రూట్ చేసినట్టు సమాచారం. ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదాలకు పాల్పడితే శాఖాపరంగా కఠినమైన శిక్షలు ఉంటాయని.. కండక్టర్లకు అదే పరిస్థితి
ఉంటుందని ఆర్టీసీ రెగ్యులర్ కార్మికులు చెబుతున్నారు. బస్సు డ్యామేజ్ అయితే డ్రైవర్ జీతం నుంచి కట్ చేస్తారని.. ప్రమాదాలకు నష్టపరిహారాన్ని డ్రైవర్ల నుంచే వసూలు చేస్తారని చెబుతున్నారు. కానీ, తాత్కాలిక డ్రైవర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలకు బాధ్యత ఎవరిదన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.

ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలేవీ?
మంగళవారం బస్సు ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ అడ్డాకుల శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని
డిపో మేనేజర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక
డ్రైవర్ పై చర్యలు తీసుకోవటానికి ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయటం
గానీ, రికవరీ చేయటం గానీ సాధ్యం కాదు. తాత్కాలిక డ్రైవర్లంటేనే బాధ్యత లేకుండా ఉంటుందన్న ఆరోపణలు
వెల్లు వెత్తుతున్నాయి.

ఆర్టీసీ అంటే.. భద్రత లేకుం డా చేశారు
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల నియామకాన్ని జోక్‌గా మార్చేశారు. పంతానికి పోయి.. నిబంధనల్ని ఉల్లంఘించారు. వేరేవాళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తే ఊకుంటరా? ఆర్టీసీ అంటేనే భద్రతతో కూడిన ప్రయాణం. నిపుణులైన డ్రైవర్ల ద్వారానే ఇది సాధ్యమైతంది. ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజలకు భద్రత ఎవరు కల్పిస్తా రు? తాత్కాలిక డ్రైవర్ల కారణంగా జరిగిన ప్రమాదాలకు ప్రభుత్వాన్ని శిక్షించాలి.
– హన్మంతు ముదిరాజ్,
ఆర్టీసీ జేఏసీ-1, కన్వీనర్

ఆరు ప్రమాదాలు.. ఇద్దరు మృతి
తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం
అదుపుతప్పి జనాలపైకి దూసుకొస్తున్న బస్సులు

జీడిమెట్లలో..
రెండు రోజుల క్రితం జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదానికి గురైంది. 50 మంది ప్రయాణికులతో గండి మైసమ్మ నుంచి సికిం ద్రాబాద్ వైపు వస్తోంది. షా థియేటర్ వద్ద ఆటో, బైక్ ఆగి ఉన్న విషయం గుర్తించకుండా తాత్కాలిక డ్రైవర్ ప్రతాపరెడ్డి బస్సును మూవ్ చేశాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఆగి ఉన్న వెహికల్స్​ని గమనించి రైట్ సైడ్ డివైడర్ పైకి ఎక్కించి కరెంట్ స్థంభాన్ని ఢీ కొట్టాడు.

కూకట్ పల్లి వై జంక్షన్‌లో..
అక్టోబర్ 14న కూకట్‌‌పల్లి వై జంక్షన్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తాత్కాలిక డ్రైవర్ మద్యం మత్తులో నడపడమే కారణమని ప్రయాణికులు దాడి చేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

అంబర్ పేట్‌లో..
చే నంబర్ చౌరస్తాలో అక్టోబర్ 16న కాచిగూడ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనుభవంలేని తాత్కలిక డ్రైవర్ ఏ.మురళి కృష్ణ మితిమీరిన వేగంతో వచ్చి బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో చెంగిచర్లకు చెందిన ఘనశ్యామ్ (42) అక్కడికక్కడే చనిపోయాడు. కోఠి నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న ఘన శ్యామ్ చే నంబర్ జంక్షన్ వద్దకు రాగానే బస్సు ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ పారిపోయి అంబర్ పేట్ పోలీసులకు లొంగిపోయాడు.

తార్నాకలో..
అక్టోబర్ 28న తార్నాకలో జనగామ డిపో బస్సు బీభత్సం సృష్టించింది. జేబీఎస్‌‌ నుంచి జనగామ వెళ్తున్న బస్సు హబ్సీగూడ సిగ్నల్స్‌‌ దగ్గర అదుపుతప్పింది. సిటీ ట్రాఫిక్‌లో తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న బస్ కంట్రోల్ కాకపోవడంతో ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, బైక్‌‌ ధ్వంసం అయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత తాత్కాలిక డ్రైవర్‌‌ పారిపోయి ఓయూ పోలీసులకు లొంగిపోయాడు.

మేడ్చల్‌లో..
కామారెడ్డి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మేడ్చల్ చెక్ పోస్టు వద్ద పోలీస్ వెహికిల్‌ని ఢీకొట్టింది. యూటర్న్ వద్ద బస్సును టర్న్ చేసేందుకు యత్నించిన తాత్కాలిక డ్రైవర్ పక్కనే ఉన్న పోలీస్ వెహికిల్‌ని ఢీ కొట్టాడు. దీంతో పోలీస్ వెహికిల్ ఆ పక్కనే ఉన్న మరో కారును ఢీకొంది.ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

మేడ్చల్ హైవే పై..
ఈ నెల 19న మేడ్చల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. 20 మంది స్టూడెంట్స్‌తో అత్వెల్లి నుంచి హైవే పై వెళ్తున్న స్కూల్ బస్సును బాన్సువాడ డిపో బస్సు ఢీ కొట్టింది. స్కూల్ బస్సు వెనుక అద్ధాలు పగిలిపోయాయి. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణపాయం నుంచి బయటపడ్డారు . ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.