హైదరాబాద్ లో మరోసారి టెర్రర్ లింకులు బయటపడ్డాయి. తీవ్ర వాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చెంచల్ గుడకు చెందిన సయీదా బేగం(30)ను మార్చి 24 మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. సయిదాను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం అదుపులోకి తీసుకుంది. దర్యాప్తులో భాగంగా ఆమెను అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.
విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటీవల వించ్‌పేట్‌కు చెందిన మహమ్మద్ రెహమతుల్లా షరీఫ్, భవానీపురానికి చెందిన మహమ్మద్ డానిష్, మహంతిపురానికి చెందిన మీర్జా సోహైల్ బేగ్ అనే ముగ్గురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిచ్చిన సమాచారంతో హైదరాబాద్ సయీదా బేగంను అదుపులోకి తీసుకున్నారు. ఫారిన్ హ్యాండ్లర్ అయిన అల్ హకీమ్ షుకూర్ ద్వారా సోహైల్ బెగ్, షరీఫ్, డానిష్ ముగ్గురిని తీవ్ర వాద సంస్థల వైపు వెళ్ళేలా సయీదా బేగం కీలకంగా వ్యవహరించారు. ఈ బృందం పలు ప్రదేశాలలో విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
