360 ఎకరాలు.. మావంటే మావి!

360 ఎకరాలు.. మావంటే మావి!

తెరపైకి వచ్చిన అటవీ, ఇరిగేషన్‌‌‌‌ శాఖ పంచాయితీ
పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్న రైతులు

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 360 ఎకరాల అసైన్డ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ పంచాయితీ రోజుకో మలుపుతిరుగుతోంది. నిన్నమొన్నటి వరకు రైతులు, అటవీ శాఖ మధ్య గొడవ ఉండగా.. తాజాగా ఇందులోకి ఇరిగేషన్‌‌‌‌ శాఖ వచ్చి చేరింది. మరో వైపు ఈ వివాదాస్పద భూములను సర్కారు ఫుడ్ పార్క్‌‌‌‌కు కేటాయించడంతో లొల్లి ఇంకో వైపు తిరిగింది.  
అసలు కథ ఇదీ...
నిజామాబాద్ మండలంలోని లక్ష్మాపూర్, మల్కాపూర్ గ్రామాల మధ్య 339 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో 360 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌‌ భూమి ఉంది. ఇందులో రెండు గ్రామాలకు చెందిన రైతులు 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. పట్టాలు కోసం పాలకులకు మొరపెట్టుకోవడంతో ఆఫీసర్లు సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికి ఆరు ప్రభుత్వాలు మారినా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 
అన్నీ చిక్కుముడులే...
మల్కాపూర్, లక్ష్మాపూర్  మధ్య ఉన్న339 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లోని అసైన్డ్‌‌ భూముల కోసం గ్రామస్తులు అటవీ శాఖతో పోరాటం చేస్తున్నారు. ఈ భూములు అటవీ శాఖకు చెందినట్లు చెబుతూ అధికారులు గ్రామస్తులపై పోలీస్​కేసులు పెట్టారు. అయితే ఏళ్ల తరబడి సాగు చేస్తున్న ఈ భూములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్ ఎదుట రెండు గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. దాదాపు 500 మంది మహిళలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కొందరు అధికార పార్టీ నాయకులు ఈ భూములపై కన్నేశారని ఆరోపించారు. అందుకే తమపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.  
న్యాయం జరిగే వరకు పోరాడుతాం..
339 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూముల్లో చాలా కాలంగా మేం సాగు చేసుకుంటున్నాం. పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా సర్కారుకు మొరపెట్టుకుంటున్నాం. జిల్లా ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశాం. పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. 
- నవనీత, మల్కాపూర్​ 
ఓటుతో బుద్ధి బెబుతాం

మా ఊరికి వచ్చిన ప్రతీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రాలు ఇచ్చాము.  కానీ మాకు ఇప్పటి వరకు న్యాయం జరుగ లేదు. 339 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో భూవివాదంపై తమకు పాలకులు న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెబుతాం.  
-  ఎస్.లక్ష్మి, లక్ష్మాపూర్​
మరో కొత్త పంచాయితీ..

ప్రాణ హిత చెవేళ్ల పథకానికి ఈ భూములను సేకరించినట్లు నీటిపారుదల శాఖ ప్రకటించింది. ప్రభుత్వం ఈ భూములను తమ శాఖకు కేటాయించిందని ఆ ఆఫీసర్లు చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే రైతులు, అటవీ శాఖ మధ్య గొడవ కొనసాగుతుండగానే ఇరిగేషన్ శాఖ కూడా రావడంతో కొత్త చిక్కు వచ్చిపడినట్లయ్యింది. తాజాగా వివాదాస్పద 360 ఎకరాల్లో 200 ఎకరాలను ప్రభుత్వం ఫుడ్ ఇండస్ట్రియల్ పార్క్‌‌‌‌కు కేటాయించింది. పార్క్‌‌‌‌లో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలకు ఈ–వేలం ద్వారా భూములను విక్రయించనున్నారు.