యోగి ప్రమాణ స్వీకారం.. అంబానీ సహా 60 మంది దిగ్గజాలకు పిలుపు

యోగి ప్రమాణ స్వీకారం.. అంబానీ సహా 60 మంది దిగ్గజాలకు పిలుపు

ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రమాణం చేయనున్నారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయీ ఇకానా క్రికెట్ స్టేడియంలో పటిష్ఠ భద్రత మధ్య ప్రమణ స్వీకారం జరగనుంది. యోగి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు సాధువులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో పాల్గొనాలని... రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ సహా 60 మంది దిగ్గజ వ్యాపారులకు ఆహ్వానం అందింది. ప్రతిపక్ష పార్టీలు.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్ డీ అధ్యక్షుడు జయంత్ చౌధరీలకూ ఆహ్వానం ఉన్నా.. ప్రమాణ స్వీకారానికి హాజరుకామని ఇప్పటికే ప్రకటించారు.

యూపీలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు.. యోగి ఆదిత్యనాథ్ ను తమ శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమిత్ షా సమక్షంలో లక్నోలో యోగిని సీఎంగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. యూపీలో వరుసగా రెండో సారి విజయం సాధించి బీజేపీ మరో రికార్డు సృష్టించింది. 37 ఏళ్ల తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. యూపీలో మొత్తం 403 సీట్లకు గాను 255 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది బీజేపీ.