హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారుల (ఎంపీఓ) జనరల్ బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. మల్టీ జోన్–1 పరిధిలోని 52 మంది ఎంపీఓలను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ డి. దివ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం ఈ బదిలీలు చేపట్టారు. బదిలీ అయిన ఎంపీవోలు తమ పాత పోస్టింగ్ నుంచి మూడు రోజుల్లోగా రిలీవ్ కావాలని కమిషనర్ ఆదేశించారు.
ఒకవేళ మూడు రోజుల్లోగా రిలీవ్ చేయకుంటే.. వారు రిలీవ్ అయినట్టుగానే భావించి కొత్త స్థానాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. కొత్తగా కేటాయించిన మండలాల్లో వెంటనే విధుల్లో చేరాలని, దీనికి సంబంధించిన వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే కమిషనర్ కార్యాలయానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సొంత అభ్యర్థన మేరకు బదిలీ అయిన వారికి టీటీఏ లేదా ఇతర బదిలీ ప్రయోజనాలు వర్తించవన్నారు. విధుల్లో చేరడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు.
