ఆవు పెండ రాఖీలు

ఆవు పెండ రాఖీలు

పెండతో ఏం చేస్తారు? ఊళ్లలో ఇంటి ముందు సాంపి చల్లుతరు. పిడకలు కొడతరు. అవి ఎండాక పొయ్యిలోకి వాడుకుంటరు. ఉత్తర్​ప్రదేశ్​లోని బిజ్నోర్​ జిల్లాలో ఉన్న నగీనా అనే ఊరోళ్లు కొత్తగా ఆలోచించిన్రు. అరె, రాఖీలు ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నరు. అదే తడవుగా ఆవు పెండతో రాఖీలు తయారు చేసిన్రు. ఇగో, ఇవే ఆ రాఖీలు మరి. శ్రీ కృష్ణ గోశాల అనే స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థ ఒకటి ఈ ఆవు పెండ రాఖీలను తయారు చేయిస్తోంది.

అల్ఖా లహోటి అనే 52 ఏళ్ల ఎన్నారై ఆలోచన నుంచి మొదలైందిది. తన తండ్రి పెట్టిన గోశాలలో సేవ చేసేందుకు సింగపూర్​లో మంచి ఉద్యోగాన్నీ ఆమె వదిలేశారు. గోశాలలో పనిచేస్తూనే ఆవు పెండ నుంచి వివిధ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. అంతిమ సంస్కారాల కోసం వాడే శ్లాబ్​లను తయారు చేసేవారు. ఆవు పెండతో రాఖీలనూ తయారు చేయాలన్న ఆలోచన ఆమెకు వచ్చింది. ‘‘జూనా అఖారాతో కలిసి పనిచేస్తున్నా. ఈ ఏడాది కుంభమేళాకు వెళ్లాను. అక్కడ ఈ ఆవుపెండ రాఖీలను ప్రదర్శించాం. అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. జనం కోసం కూడా ఇలాంటి రాఖీలను తయారు చేయాల్సిందిగా సాధువులు అడిగారు. దీంతో ఇతర నిపుణులతో మాట్లాడి రాఖీలను తయారు చేస్తున్నాం.

ఇప్పటిదాకా కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, ఒడిశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. వేలాది రాఖీలను పండుగ కోసం సిద్ధం చేశాం” అని లహోటి చెప్పారు. మొదట తాము తయారు చేసిన రాఖీలు త్వరగా పగిలిపోయాయని, అయినా పట్టువదలకుండా ప్రయోగాలు చేసి గట్టివైన, పగిలిపోని రాఖీలను తయారు చేయగలిగామని అన్నారు. ఎండ తగలకుండా చల్లటి నీడ ప్రాంతంలో పెట్టడంతో రాఖీలు పాడవలేదని చెప్పారు.

రాఖీల తయారీ కోసం ముందుగా వివిధ రూపాలు, సైజుల్లో అచ్చులు తయారు చేశామని, వాటిలో ఆవు పెండను వేసి నీడలో భద్రపరిచామని చెప్పారు. అవి ఎండిపోయాక పర్యావరణానికి మేలు చేసే రంగులతో వాటిని అందంగా తీర్చిదిద్దామన్నారు. త్వరగా భూమిలో కలిసిపోయే దారాలను వాడామన్నారు. తక్కువ ధరకే అమ్ముతామని, అమ్ముడుపోని వాటిని ఫ్రీగా పంచేస్తామని లహోటి తెలిపారు.