శర్వానంద్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ (Biker) బాక్సాఫీస్ వద్ద తన జోరును ప్రదర్శిస్తోంది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బైక్ రేసింగ్ నేపథ్యానికి బలమైన తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లను రాబడుతోంది.
తొలిరోజు వసూళ్లు..
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘బైకర్’ చిత్రం మొదటి రోజు భారత్‌లో దాదాపు రూ. 3.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నెట్ ప్రాఫిట్ పరంగా చూస్తే రూ. 2.80 కోట్లు వసూలు చేసింది. ఇందులో మెజారిటీ వాటా తెలుగు వెర్షన్‌దే . తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 2.05 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టంది. తొలిరోజు ఉదయం ఆటలకు 22.5% ఆక్యుపెన్సీ నమోదైనప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో మధ్యాహ్నం , సాయంత్రం షోలకు ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలుగు (2D) వెర్షన్ సుమారు 1,800 షోలలో 23% సగటు ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.5 కోట్లు వసూళ్లు రాబట్టింది.
రెండో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్
వీకెండ్ కావడంతో రెండో రోజు కూడా ‘బైకర్’ తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,472 షోలతో రన్ అవుతున్న ఈ చిత్రం, లైవ్ అప్‌డేట్స్ ప్రకారం రెండో రోజు మధ్యాహ్నం వరకు ఇండియాలో రూ. 1.31 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. వీకెండ్ కావడంతో సాయంత్రం షోలకు వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కలెక్షన్స్ పై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కథలో ఎమోషన్..
ఈ సినిమాకు ప్రధాన బలం శర్వానంద్ , రాజశేఖర్ మధ్య సాగే తండ్రి-కొడుకుల బంధం. వికాస్ నారాయణ్ (శర్వానంద్) ఒక బైక్ రేసర్‌గా తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) తో ఎదురయ్యే సంఘర్షణలు, క్రమశిక్షణ,పట్టుదల వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించారు. శర్వానంద్ రేసర్‌గా అద్భుతమైన నటన కనబరచగా, రాజశేఖర్ తన సీనియారిటీతో పాత్రకు ప్రాణం పోశారు. మాళవిక నాయర్ ,అతుల్ కుల్కర్ణి కీలక పాత్రల్లో మెప్పించారు. బైక్ రేసింగ్ సీక్వెన్స్‌లు చాలా నేచురల్‌గా, హై-వోల్టేజ్ యాక్షన్‌తో ప్రేక్షకులకు కిక్ ఇస్తున్నాయి.
►ALSO READ | ప్రేమించిన అమ్మాయే వెన్నుపోటు పొడిస్తే? అడవి శేష్ 'డెకాయిట్' ట్రైలర్ రిలీజ్!
చాలా కాలం తర్వాత తెలుగులో ఒక పక్కా స్పోర్ట్స్ డ్రామా రావడం, దానికి ఎమోషన్ తోడవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. రొటీన్ మాస్ సినిమాల కంటే భిన్నంగా, హార్ట్ టచింగ్ కథలతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘బైకర్’ మరోసారి నిరూపిస్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. లాంగ్ రన్‌లో ఈ చిత్రం శర్వానంద్ కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు.
