టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. లేటెస్ట్ గా ఏప్రిల్ 3న విడుదలైన ఫాంటసీ-హర్రర్ డ్రామా 'రాకాస' (Rakasa) అదే బాటలో పయనిస్తోంది. యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం, తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. నిహారిక కొణిదెల, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను భయపెడుతూనే అలరిస్తోంది.
తొలిరోజు వసూళ్లు ఎంత?
ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం 'రాకాస' ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే దాదాపు రూ. 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు సినీ ట్రెడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. కర్ణాటక, ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో మరో రూ. 2 కోట్లు రాబట్టినట్లు అంచనా. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విలువ సుమారు రూ. 12.5 కోట్లుగా ఉంది. అంటే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే దాదాపు రూ. 27 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇది సాధ్యమయ్యే టార్గెట్టే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
డిజిటల్,శాటిలైట్ హంగామా
థియేటర్లలోకి రాకముందే 'రాకాస' సేఫ్ జోన్లోకి వెళ్లింది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీ మొత్తంలో పెట్టుబడి వెనక్కి వచ్చినట్లు సమాచారం. దీనివల్ల నిర్మాతలకు రిస్క్ తగ్గి, కేవలం థియేటర్ వసూళ్లపైనే దృష్టి సారించే వెసులుబాటు కలిగింది.
ఆకట్టుకుంటున్న హర్రర్ ఎలిమెంట్స్
దర్శకురాలు మానస శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు దక్కుతున్నాయి. సాధారణ హర్రర్ సినిమాలకు భిన్నంగా ఫాంటసీని జోడించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. సంగీత్ శోభన్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, నయన్ సారిక గ్లామర్, పర్ఫార్మెన్స్తో మెప్పించింది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటుల ఉనికి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం హర్రర్ సీన్లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిందని ఆడియన్స్ చెబుతున్నారు.
వీకెండ్ టార్గెట్ ఇదే!
సాధారణంగా యాక్షన్ సినిమాల మధ్య ఇలాంటి విభిన్నమైన హర్రర్ థ్రిల్లర్ రావడం 'రాకాస'కు ప్లస్ పాయింట్ అయింది. వీకెండ్ బుకింగ్స్ ఇప్పటికే ఆశాజనకగా ఉన్నాయని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.. మౌత్ టాక్ బాగుండటంతో ఈవెనింగ్ , నైట్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తరలివస్తున్నారు. మరి ఈ వీకెండ్లో 'రాకాస' ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
