అన్నామలై అంటే గుర్తొచ్చేది వీధి పోరాటాలు.. వివాదాలు. తమిళనాట కాశాయ జెండా ఎగరవేసేందుకు.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధాంత రాద్ధాంతాలెన్ని చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంపై చర్చ నడుస్తోంది. సౌత్ లో జెండా పాతాలనుకుంటున్న బీజేపీ.. అందుకు తగినట్లే ఎన్డీఏ కూటమిలో భాగంగా విశ్వప్రయత్నం చేస్తున్న సందర్భంలో పోటీకి దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
ఈ మాజీ అధ్యక్షుడిని అధిష్టానం పక్కన పెట్టిందని కొందరు.. టికెట్ ఇవ్వలేదని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. దీనిపై స్పందించారు అన్నామలై. బీజేపీ టికెట్ ఇవ్వకపోడం అంటూ ఏమీ లేదని.. తానే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కోయింబత్తూరు నుంచి వస్తూ చెన్నై ఎయిర్ పోర్టులో సైలెంట్ ను బ్రేక్ చేశాడు. ఏ నియోజకవర్గంలోనూ పోటీ చేయకూడదనే విషయాన్ని కోర్ కమిటీకి చెప్పాను. టికెట్ ఇవ్వకపోడం కాదు.. నేను పోటీ చేయడం లేదు అంతే అంటూ వివరణ ఇచ్చారు.
పార్టీ పక్కనపెట్టిందా అన్న ప్రశ్నకు.. నేను నిలబడొద్దు అనుకున్నపుడు పార్టీ టికెట్ ఎలా ఇస్తుంది చెప్ండి.. అంటూ ప్రశ్నించారు. నా నిర్ణయాన్ని గౌరవించినందుకు కేంద్ర కమిటీకి కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్ని నియోజకవర్గాల్లోని కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు.
తమిళనాడు ఎన్నికల్లో భాగంగా బీజేపీ 27 మంది అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన సందర్భంగా.. అన్నమలైని పక్కన పెట్టారు అనే వాదనలపై ఆయన పై విధంగా సమాధారం ఇచ్చారు. అయితే తాను ఎందుకు పోటీ చేయడం లేదో కారణాలు మే 4న వివరంగా చెప్తానని అన్నారు.
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. మొత్తం 234 సీట్లున్న అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా సాగుతున్నాయి. సౌత్ లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అధికారాన్ని నిలుపుకునేందుకు డీఎంకే ఉవ్విళ్లూరుతోంది. ఇదే సమయంలో సినీ నటుడు విజయ్.. వీటీకే పార్టీతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎంత ప్రభావం చూపిస్తాడనేది మే 4వ తేదీన తెలుస్తుంది.
