ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే సమాజంలో రాయల్ లైఫ్ అనే పేరు ఉండేది. ముఖ్యంగా మెటా, గూగుల్ వంటి సంస్థల్లో పనిచేయడం అంటే అదొక పెద్ద స్టేటస్ సింబల్. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నేను సాప్ట్ వేర్, ఐటీ జాబ్ అని చెప్పుకుంటూ తిరిగే ప్రెస్టేజ్ రోజులు ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయ్ అంటూ ఒక మెటా ఇంజనీర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ఐటీ వర్గాల్లో ప్రశ్నలు సంధిస్తోంది. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని భయం, తోటి ఉద్యోగులతోనే గొంతు కోసే పోటీ, AI రూపంలో పొంచి ఉన్న ముప్పు.. వెరసి ఐటీ ఉద్యోగుల జీవితం ఇప్పుడు ఒక అభద్రతా భావానికి కేంద్రంగా మారింది.
బ్లైండ్ ఫోరమ్‌లో వైరల్ అయిన ఆ పోస్ట్ ప్రపంచ టెక్ రంగంలోని అసలు రంగును బయటపెట్టింది. "మేమంతా ఒకరితో ఒకరం పోటీ పడుతున్నాం.. కానీ ఏదో ఒక రోజు మా అందరినీ పంపించేస్తారని మాకు తెలుసు. ఇది జరుగుతుందా అన్నది ప్రశ్న కాదు, ఎప్పుడు జరుగుతుంది అన్నదే అసలు ప్రశ్న" అంటూ సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాసిన మాటలు ఐటీ నిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఒకప్పుడు ఫేస్‌బుక్ ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకునే రోజులు పోయి.. ఇప్పుడు ఎప్పుడు లేఆఫ్ లెటర్ వస్తుందో అని వణికిపోయే రోజులు వచ్చాయి. భారీ జీతాలు ఉన్నా.. సౌత్ బే వంటి ఖరీదైన నగరాల్లో బతకడం ఇప్పుడు భారంగా మారుతోందని సదరు టెక్కీ పేర్కొన్నారు. అతని మాటలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండటంతో సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చ జరుగుతోంది.
The tech prestige era is dead.
— Official Layoff (@LayoffAI) April 3, 2026
Meta engineers on Blind are posting “we all know we’ll be let go, it’s not if, it’s when.”
Silicon Valley is getting more and more toxic each day. https://t.co/hlZgCaOv4h pic.twitter.com/xHVECOAOg6
లేఆఫ్స్ అనేవి ఇప్పుడు కేవలం మెటాకు మాత్రమే పరిమితం కాలేదు. దిగ్గజ సంస్థ ఒరాకిల్ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. వాషింగ్టన్, సీటెల్ ప్రాంతాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా దాదాపు 12వేల మందిపై వేటు వేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మరో రౌండ్ లేఆఫ్స్ ఉంటాయన్న ప్రచారం ఉద్యోగులను నిద్రపోనివ్వడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే 70కి పైగా టెక్ కంపెనీలు దాదాపు 40వేల మందిని ఇంటికి పంపించేశాయి. ఈ విధ్వంసానికి ప్రధాన కారణం ఏఐ అని స్పష్టమవుతోంది. కంపెనీలు తమ వనరులను మనుషుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తుండటంతో సామాన్య ఉద్యోగి బలిపశువు అవుతున్నాడు మధ్యలో.
►ALSO READ | ఇరాన్ యుద్ధంతో ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్.. గల్ఫ్ దేశాలకు డ్రోన్ టెక్నాలజీ అమ్మకం
ఈ అనిశ్చితి ఐటీ ఉద్యోగులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతోంది. "ఐటీ రంగం ఇక చాలు.. ఈ అన్యాయమైన ప్రపంచం నాకు వద్దు" అంటూ సదరు మెటా ఇంజనీర్ చేసిన క్లోజింగ్ కామెంట్స్ టెక్ ప్రపంచంలో పెరుగుతున్న నిరాశకు అద్దం పడుతున్నాయి. ఏఐ విప్లవం ఒకవైపు కొత్త అవకాశాలను తెస్తున్నా.. మరోవైపు లక్షలాది మంది జీవితాలను చిందరవందర చేసేస్తోంది. కంపెనీలు లాభాల వేటలో మానవత్వాన్ని మర్చిపోయి చేస్తున్న ఈ రీస్ట్రక్చరింగ్ పక్రియ ఐటీ రంగాన్ని ఒక చీకటి దిశగా నడిపిస్తోంది. ఇప్పుడు ఐటీ కొలువు అంటే భరోసా ఇచ్చే ఆయుధం కాదు.. ఎప్పుడు పేలుతుందో తెలియని టైమ్ బాంబ్ లా మారిపోయాయన్నది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవంగా మారిపోయింది.
