అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయారు: కేరళ స్టోరీ, దురంధర్ సినిమాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయారు: కేరళ స్టోరీ, దురంధర్ సినిమాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

తిరువనంతపురం: కేరళ స్టోరీస్, దురంధర్ సినిమాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (ఏప్రిల్ 4) తిరువల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ కేరళలోని అధికార ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పార్టీలపై విరుచుకుపడ్డారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కేరళ స్టోరీస్, దురంధర్ చిత్రాలు అబద్ధం, కల్పితమని కాంగ్రెస్, ఎల్‌డీఎఫ్ కొట్టి పారేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడంలో ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్‌లు ఆరితేరిపోయాయని ఎద్దేవా చేశారు. 

దేశీ విరాళాల నియంత్రణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్‎లకు సంబంధించి కూడా ఇలాగే తప్పుడు ప్రచారం చేస్తూ  కాంగ్రెస్, వామపక్షాలు అబద్ధాల కర్మాగారంగా మారాయని విమర్శించారు. మిడిల్ ఈస్ట్‎లో ఉద్రిక్తతల వేళ స్వదేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇరాన్, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న దాదాపు కోటి మంది భారతీయ వలసదారుల ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడేస్తోందని నిప్పులు చెరిగారు. 

ఎన్నికల్లో గెలవడానికి, తన పేరు బద్నాం చేయడానికి కాంగ్రెస్ స్వార్థపూరిత నీచ రాజకీయాలు చేస్తోందని.. అందుకు ఆ పార్టీ కేరళ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. పశ్చిమ ఆసియా దేశాలు భారతదేశాన్ని ఒక శత్రువుగా చూడాలని కాంగ్రెస్ కోరుకుంటోందని.. ఈ కుట్రలో భాగంగానే గల్ఫ్ దేశాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రకటనలు చేస్తోందని ధ్వజమెత్తారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. గల్ఫ్, ఇరాన్‌లలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

►ALSO READ | హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ నౌక గ్రీన్ సాన్వి..భారత్ కు ఇరాన్ స్పెషల్ మెసేజ్

దేశ ప్రజల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి.. ఎన్నికల కోసం ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దని ప్రత్యర్థులకు చురకలటించారు. ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్‌ల మధ్య రహస్య భాగస్వామ్యంఉందని.. అవి రెండూ ఒకే నాణేనికి రెండు వైపులాంటివని ఆరోపించారు. తమ లోపాయికారీ ఒప్పందం బయట పడకుండా బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తు్న్నాయని ధ్వజమెత్తారు. 

కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే పవిత్ర శబరిమల ఆలయంలో జరిగిన బంగారం చోరీ కేసు సమగ్రంగా దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.  రాష్ట్రంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)ను గద్దె దించేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి వీడ్కోలు పలకడానికి కేరళ సిద్ధంగా ఉందని బీజేపీ కార్యకర్తలు బలమైన సంకేతాలు ఇచ్చారని పేర్కొన్నారు. కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పక్కా విజయం సాధిస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.