మున్సిపోల్స్ లో 70.26 శాతం పోలింగ్‌‌

మున్సిపోల్స్ లో 70.26 శాతం పోలింగ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్​ ఎలక్షన్లలో 70.26 శాతం ఓటింగ్​ నమోదైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మొత్తం 49,75,093 మంది ఓటర్లకుగాను 34,95,322 మంది ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌‌లో అత్యధికంగా 93.31 శాతం, పోచంపల్లిలో 92.51 శాతం ఓటింగ్​ నమోదుకాగా.. అతి తక్కువగా నిజాంపేట కార్పొరేషన్‌‌లో 39.65 శాతం, మణికొండ మున్సిపాలిటీలో 41.03 శాతం పోలింగ్‌‌ నమోదైంది. నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా చండూర్‌‌లో 92.01, యాదగిరిగుట్టలో 90.69, ఆదిభట్లలో 90.27 శాతం ఓట్లు పోలయ్యాయి. 43 మున్సిపాలిటీల్లో 80 శాతానికిపైగా, 44 మున్సిపాలిటీల్లో 70 శాతానికిపైగా, 21 మున్సిపాలిటీల్లో 60 శాతానికిపైగా పోలింగ్‌‌ నమోదైంది. జల్‌‌పల్లిలో 46.91 శాతం మందే ఓటేశారు. పోలింగ్​ సందర్భంగా పలు చోట్ల వివిధ పార్టీ లీడర్లు, కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగినా, పోలీసులు వెంటనే నియంత్రించారు. కొన్నిచోట్ల దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ప్రతిపక్షాల నాయకులు ఆందోళన చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నాగిరెడ్డి వెబ్‌‌ కాస్టింగ్‌‌ ద్వారా పోలింగ్‌‌ సరళిని పర్యవేక్షించారు. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినట్టు ప్రకటించారు.

కార్పొరేషన్లలో..

రామగుండం కార్పొరేషన్‌‌లో 67.66 శాతం, పీర్జాదిగూడలో 64.31, బోడుప్పల్‌‌లో 64.24, బడంగ్‌‌పేట్‌‌లో 63.87, నిజామాబాద్‌‌లో 61.04, బండ్లగూడ జాగీర్‌‌లో 56.06, మీర్‌‌పేటలో 51.78, జవహర్‌‌నగర్‌‌ లో 50.02, నిజాంపేటలో 39.65 శాతం పోలింగ్‌‌ నమోదైంది. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండే నిజాంపేట, మణికొండలాంటి ప్రాంతాల్లో రాష్ట్రంలోనే అతి తక్కువగా పోలింగ్‌‌ జరిగింది. సాయంత్రం 5 గంటలకల్లా 95 శాతానికిపైగా పోలింగ్‌‌ స్టేషన్లలో ఓటింగ్‌‌ ప్రక్రియ ముగిసింది. కొన్నింటిలో మాత్రం 5 గంటల్లోగా వచ్చినవారు ఓటేసేదాకా పోలింగ్​నిర్వహించారు. తర్వాత బ్యాలెట్‌‌ బాక్సులను సీల్‌‌ చేసి కలెక్షన్‌‌ సెంటర్లకు, స్ట్రాంగ్‌‌ రూములకు తరలించారు. కామారెడ్డిలో టెండర్‌‌ ఓటు

మున్సిపల్‌‌ ఎలక్షన్లలో కామారెడ్డిలో తొలి టెండర్‌‌ ఓటు పడింది. ఈ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 41కు సంబంధించి పోలింగ్ స్టేషన్  నంబర్​ 101లో టెండర్ ఓటు పడింది. ఓ మహిళ ఓటును అప్పటికే ఎవరో వేసినట్టుగా ప్రిసైడింగ్‌‌ అధికారి వద్ద నమోదై ఉంది. సదరు మహిళ టెండర్‌‌ బ్యాలెట్‌‌ను డిమాండ్‌‌ చేసి, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈసీ తీసుకునే తదుపరి చర్యల మేరకు అక్కడ శుక్రవారం రీపోలింగ్‌‌ నిర్వహించే అవకాశముంది. ఈ ఒక్క చోట తప్ప మరెక్కడా రీపోలింగ్‌‌కు అవకాశం లేదని తెలిపారు.

భైంసాలో 64.70 శాతం పోలింగ్‌‌

మున్సిపల్‌‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే వేళ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి, కర్ఫ్యూ పెట్టిన భైంసాలో 64.70 శాతం పోలింగ్‌‌ నమోదైంది. భైంసాలో ఎన్నికలపై రాజకీయ పార్టీలు, క్యాండిడేట్లు ఆందోళన చెందినా.. క్రమేణా పరిస్థితులు మెరుగవడంతో షెడ్యూల్‌‌ ప్రకారమే ఓటింగ్‌‌ జరిగింది. ఇక జీహెచ్‌‌ఎంసీలోని డబీర్‌‌పురా డివిజన్​లో 27.37 శాతమే పోలింగ్‌‌ నమోదైంది.

కొత్త మున్సిపాలిటీల్లో భారీగా..

గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌‌ గ్రేడ్‌‌ అయిన పట్టణాల్లో పోలింగ్‌‌ శాతం భారీగా రికార్డు అయ్యింది. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం వరకు కాస్త తక్కువగానే పోలింగ్‌‌ జరిగినా.. సాయంత్రానికి 55 శాతం దాటింది. గ్రేటర్‌‌ ఓటర్ల మాదిరిగానే నిజాంపేట్‌‌, మణికొండ, జల్‌‌పల్లి మున్సిపల్‌‌ ఓటర్లు ఓటేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. పోలింగ్‌‌ జరుగుతున్న పట్టణాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. ప్రైవేటు సంస్థలు లీవ్​ ఇవ్వలేదు.

గ్రేటర్‌‌ శివార్లలో 62.3 శాతమే

  • గ్రేటర్‌‌  హైదరాబాద్​ శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్‌‌  -జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 62.30 శాతమే పోలింగ్​ నమోదైంది. మేడ్చల్‌‌ జిల్లాలో 13, రంగారెడ్డి జిల్లాలో 15 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 12,24,094 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 7,62,733 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఈ రెండూ కాకుండా రాష్ట్రంలోని మిగతా 28 జిల్లాల్లో ఉన్న 101 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 72.85 శాతం పోలింగ్​ నమోదైంది. వీటన్నింటిలో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 37,50,999 మందికాగా.. 27,32,589 మంది ఓటు వేశారు.
  • జిల్లాల వారీగా చూస్తే… అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 88.32 శాతం, వరంగల్‌‌ రూరల్‌‌లో 84.48, సూర్యాపేటలో 83.29, మహబూబ్‌‌నగర్‌‌లో 82.12, సిద్దిపేటలో 81.90, పెద్దపల్లిలో 81.51, కరీంనగర్‌‌లో 80.51 శాతం పోలింగ్‌‌ నమోదవగా.. తక్కువగా జగిత్యాల జిల్లాలో 50.32 శాతం, మేడ్చల్‌‌లో 59.09 శాతం, నారాయణపేటలో 64.40, రంగారెడ్డిలో 65.25, మంచిర్యాలలో 66.38 శాతం ఓటింగ్​ రికార్డయింది.