న్యాక్ బలోపేతంపై సీఎం ఫోకస్

న్యాక్ బలోపేతంపై సీఎం ఫోకస్
  • ఇటీవల చైర్మన్​ హోదాలో క్యాంపస్​ను​ పరిశీలించిన రేవంత్
  • 50 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • కోడ్ ముగిసిన తర్వాత స్కిల్ యూనివర్సిటీపై నిర్ణయం

హైదరాబాద్ , వెలుగు: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్​(న్యాక్) పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. న్యాక్ చైర్మన్ హోదాలో ఇటీవల క్యాంపస్​లో 3 గంటల పాటు కలియతిరిగి, అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. క్యాంపస్​లో అందిస్తున్న కోర్సులు, ప్లేస్ మెంట్స్​ ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 25 వేల మంది ప్రతి ఏటా ఇక్కడ వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకొని, కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారని అధికారులు తెలుపగా.. ఈ సంఖ్యను 50 వేలకు పెంచాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఇందుకు సాధ్యమైనంత త్వరలో యాక్షన్ ప్లాన్ ను రూపొందించి, తనకు అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్​ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు వివిధ రకాల కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం న్యాక్ సహకారం తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

కోడ్ ముగిసిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ

రాష్ట్రంలో కన్​స్ట్రక్షన్​ఫీల్డ్ లో లక్షల కోట్ల విలువైన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణ కంటే ఇతర రాష్ట్రాల కూలీలు, స్కిల్డ్ ఎంప్లాయిస్ ఎక్కువమంది పనిచేస్తున్నారు.  మన రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం న్యాక్ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

 సాధ్యాసాధ్యాలపై  అప్పటి ప్రభుత్వం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆ  ప్రభుత్వ టర్మ్ ముగిసే వరకు కమిటీ నివేదిక ఇవ్వలేదు. కాంగ్రెస్​ సర్కారు అధికారంలోకి రావడంతో యూనివర్సిటీ ఏర్పాటుపై కదలిక వచ్చింది. న్యాక్​ క్యాంపస్​కు వచ్చిన సీఎం దృష్టికి యూనివర్సిటీ ఏర్పాటు విషయాన్ని ఇక్కడి అధికారులు తీసుకొచ్చారు.

దీనిపై  సీఎం స్పందిస్తూ.. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మరోసారి రివ్యూకు వస్తానని, అప్పుడు నిర్ణయం తీసుకుందామని తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటుపై రేవంత్ సానుకూలంగా స్పందించారు. క్రెడాయ్ తో పాటు పలువురు బిల్డర్లు సీఎంను కలిసిన సందర్భంలో కూడా యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేసి, ఆయనను ఒప్పించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. స్కిల్​ యూనివర్సిటీకి కనీసం 20 ఎకరాల స్థలం అవసరం కాగా,  ప్రస్తుతం మాదాపూర్ హైటెక్స్ దగ్గర ఉన్న న్యాక్ క్యాంపస్ లో ల్యాండ్ అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

20కి పైగా కోర్సులు

1998లో రాష్ట్ర  ప్రభుత్వం, బిల్డర్స్​అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మాదాపూర్ లో హైటెక్స్ పక్కన  47 ఎకరాల విస్తీర్ణంలో న్యాక్ ఏర్పాటైంది. ఇప్పటి వర కూ  4 .45 లక్షల మందికి ఇందులో ట్రైనింగ్​ ఇచ్చారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49  ట్రై నింగ్ సెంటర్లు ఉన్నాయి.  తెలంగాణ ఏర్పాటు తర్వాత సుమారు 1 .15 లక్షల మంది ఇక్కడ శిక్షణ పొందారు. ఇందులో వివిధ కోర్సులు పూర్తి చేసి, ఇంటర్న్ షిప్ తర్వాత వివిధ కంపెనీల్లో 85 శాతం మంది జాబ్ లు పొందినట్టు న్యాక్ అధికారులు చెబుతున్నారు.

ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ తో  పాటు ఉచిత వసతి, ఫ్రీ ఫుడ్ సౌకర్యం కల్పిస్తున్నారు.  నెల నుంచి ఏడాది వరకు కన్​స్ట్రక్షన్, సివిల్, మెకానికల్ రంగాల్లో వివిధ రకాల సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నారు. వీటిలో 5, 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ప్రవేశాలకు అవకాశముంది.  ప్రధానంగా జనరల్ వర్క్ సూపర్ వైజర్, హైవే సూపర్ వైజర్, స్టోర్ కీపర్, ల్యాండ్ సర్వేయర్,  ఎలక్ట్రికల్​ హౌస్​ వైరింగ్, ప్లంబింగ్ సానిటేషన్, ఫార్మ్ వర్కింగ్, బిల్డింగ్ కార్పెంటరీ, పెయింటింగ్ డెకరేషన్ , వెల్డింగ్, కర్టెన్ గార్మెంట్ స్టిట్చింగ్​కోర్సులు అందిస్తున్నారు. ప్రముఖ కంపెనీలైన ఎల్అండ్ టీ, జేసీబీ, వోల్వోలతో స్కిల్ డెవలప్ మెంట్ లో ఎంవోయూలు కుదుర్చుకున్నది.

కంపెనీల్లో రిక్రూట్ మెంట్ 

హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని మెట్రో నగరాలు, ఇతర దేశాల్లో జరుగుతున్న నిర్మాణాల్లో ఇంజినీర్లు, ఇతర వర్కర్లలో లక్షల మంది న్యాక్ లో ట్రైనింగ్ తీసుకున్న వారే ఉన్నారు. ప్రస్తుతం వీరు నెలకు లక్ష పైగా వేతనాలు అందుకుంటున్నారు. ఇతర దేశాల నుంచి కూడా వచ్చి న్యాక్ లో ట్రైనింగ్ పూర్తయిన వారిని రిక్రూట్ చేసుకొని, అక్కడికి తీసుకెళ్తున్నారని న్యాక్ అధికారులు చెబుతున్నారు.

న్యాక్​ ఏర్పాటులో భాగస్వామ్యమైన బిల్డర్స్​అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో  హైదరాబాద్ లో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హైరైజ్డ్​టవర్స్, విల్లాల నిర్మాణాలు చేపడుతున్న బడా కాంట్రాక్టర్లు సైతం మెంబర్లుగా, బోర్డు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. దీంతో న్యాక్​లో ట్రైనింగ్​ పొందినవారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.