
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
- పిడుగులు పడి నలుగురు మృతి
నెట్ వర్క్, వెలుగు: పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల, పెద్ద గొట్టిముక్కుల, శివ్వంపేట, చెన్నాపూర్ గ్రామాల్లో కుండపోత వాన పడింది. చిన్న గొట్టిముక్కులలో వడ్ల కొనుగోలు కేంద్రం జలమయమైంది. వరదకు వడ్లు కొట్టుకుపోయాయి. కౌడిపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో దాదాపు గంటసేపు వాన దంచికొట్టింది.
చిలప్ చెడ్ మండలం అజ్జమర్రి, చండూర్, చిట్కూల్ కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. వడ్లు తెచ్చి 20 రోజులుగా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. ఇక వరంగల్ జిల్లా నర్సంపేట, ములుగు జిల్లా మల్లంపల్లి, హనుమకొండ జిల్లా ఆత్మకూరులోనూ భారీ వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
పిడుగులకు నలుగురు బలి
పిడుగులు పడి నలుగురు మృతి చెందారు. తాండూర్ నియోజకవర్గ పరిధిలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు రైతులు చనిపోయారు. బెన్నూరు గ్రామానికి చెందిన అనుమప్ప (68) పొలంలో పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. జుంటుపల్లి గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్ (35), కోనింటి లక్ష్మప్ప (50) పొలంలో పని చేస్తుండగా పిడుగు పడి ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు.
కాగా, సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని అనాజీపురంలో మట్టపల్లి వెంకన్న (50) పిడుగుపాటుతో చనిపోయాడు. వర్షం కురుస్తున్న టైమ్ లో చెట్టు కింద నిలబడగా, పిడుగు పడడంతో స్పాట్ లోనే మరణించాడు.