ఆటో కాదిది.. అంబులెన్స్‌

ఆటో కాదిది.. అంబులెన్స్‌

ఎక్కడైనా యాక్సిడెంట్​ జరిగితే ‘అయ్యో పాపం’ అంటారు కొందరు. వీడియోలు, సెల్ఫీలు తీసుకొని సోషల్​ మీడియాలో పెడతారు ఇంకొందరు. ప్రమాదం గురించి తెలుసుకొని అంబులెన్స్​కు ఫోన్​ చేస్తారు మరికొందరు. కొన్నిసార్లు అంబులెన్స్​ వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. టైంకి అంబులెన్స్​ అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారని బాధపడ్డాడు ఈ తాత. అందుకే తన ఆటోను అంబులెన్స్​గా మార్చి, ఎంతోమందిని కాపాడుతున్నాడు.

ఆటోను అంబులెన్స్​గా మార్చిన ఈ పెద్దాయన పేరు హర్జీందర్​ సింగ్​. వయసు డెభ్బై ఆరు. ఈయన నడిపే ఆటో అంబులెన్స్​లో కాటన్​, బ్యాండేజ్​, ఆయింట్​మెంట్, ట్యాబ్లెట్లతో పాటు వాటర్​క్యాన్ ఉంటాయి. దెబ్బ తగిలితే ఫస్ట్​ ఎయిడ్​ చేస్తాడు. అవసరమైతే ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్​మెంట్​ ఇప్పిస్తాడు. ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ఫ్రీగా మందులు కూడా ఇస్తాడు.

బెస్ట్​ ఆటో డ్రైవర్​

ఢిల్లీకి చెందిన హర్జీందర్​సింగ్ ​నలభై ఏళ్లుగా ఆటో నడుపుతున్నాడు. కొంతమంది డ్రైవర్లు అడ్డదిడ్డంగా వెహికల్స్​ను నడుపుతుంటారు. నిర్లక్ష్యంగా నడుపుతూ ఒక్కోసారి  ట్రాఫిక్​ జాంకు​ కారణమవుతారు. కానీ హర్జీందర్​ సింగ్​ డ్రైవింగ్​ రూల్స్​ పాటిస్తూ, చక్కగా డ్రైవింగ్​ చేస్తాడు. నలభై ఏళ్ల సర్వీస్​లో ఒక్కరోజు కూడా పోలీసులకు చలానా కట్టలేదు. పోలీస్​ డిపార్ట్​మెంట్​ హర్జీందర్​ అంకితభావాన్ని మెచ్చి ‘బెస్ట్​ ఆటో డ్రైవర్’​గా సెలెక్ట్​ చేసి సర్టిఫికెట్​ కూడా అందించింది.

ఆటో అంబులెన్స్​

హర్జీందర్​సింగ్​ మొదట్లో రిక్షా నడిపాడు. ఆ తర్వాత ఆటోకు షిఫ్ట్​ అయ్యాడు. యూనియన్​ మెంబర్​తోపాటు ట్రాఫిక్​ వార్డెన్​ కూడా. “ నా చిన్నప్పుడు ఢిల్లీలో వరదలు వచ్చాయి. ఎంతోమంది రోడ్డున పడ్డారు. నాలాంటివాళ్లు ఒక గ్రూపుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేశాం. ‘సిక్కు​ కమ్యూనిటీ మెంబర్​’గా నావంతు సాయం చేశా. అప్పుడే సమాజానికి ఏదైనా చేయాలనిపించింది. అలా వచ్చిన ఆలోచనే ఈ ఆటో అంబులెన్స్​’’ అని చెప్పాడు పెద్దాయన.

ఆస్పత్రికి చేరుస్తూ..

దేశ రాజధాని అయిన ఢిల్లీలో రెగ్యులర్​గా యాక్సిడెంట్స్​​ అవుతాయి. అంబులెన్స్​కు ఫోన్​ చేసినా సరైన టైంకు రావు.  ట్రాఫిక్, ఇతర కారణాల వల్ల చాలామంది చనిపోతున్నారు. అందుకే ఫ్రీ అంబులెన్స్​ సర్వీస్​ మొదలుపెట్టా అంటాడు ‘‘నేను వెళ్లే దారిలో ఎవరికైనా యాక్సిడెంట్​ అయితే దగ్గర్లో ఉన్న హాస్పిటల్​కు తీసుకెళ్తా. దాంతో వెంటనే ట్రీట్​మెంట్​ అందుతుంది. ఆటో వెనకాల ‘ఫ్రీ అంబులెన్స్​ సర్వీస్​’ అని రాసి ఉంటుంది. ఒక్కోసారి గవర్నమెంట్​ అంబులెన్స్​కు బదులు నాకే ఫోన్​ చేస్తారు. అక్కడికి వెళ్లి ఫస్ట్​ ఎయిడ్​ సర్వీస్​ చేస్తా. ఇందుకోసం ట్రైనింగ్​ కూడా తీసుకున్నా. నా సాయం చూసి ఢిల్లీవాళ్లు ‘సింగ్​ తాత యూ ఆర్​ గ్రేట్’​ అని  అంటారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. అందుకే తోటి మనుషులకు సాయపడాలనుకున్న. ఇప్పటివరకు ఎంతమంది ప్రాణాలు కాపాడేనో నాకు గుర్తులేదు. చివరి శ్వాస వరకు ఇదే పనిచేస్త. ‘ఈ ఏజ్​లో ఇలాంటివి అవసరమా’ అని ఇంట్లోవాళ్లు అంటుంటారు.  కానీ ‘దీంట్లోనే నాకు ఆనందం’ ఉందని చెప్తా”అంటాడు హర్జీందర్​.