- పాలిసెట్‌లో 82.77 శాతం మంది పాస్
- 86.63 శాతంతో అమ్మాయిలు ఫస్ట్ ప్లేస్
- 78.62 శాతం సాధించిన అబ్బాయిలు ఫలితాలు విడుదల చేసిన నవీన్ మిట్టల్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నిర్వహించిన పాలి సెట్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. అబ్బాయిలు 78.62 శాతం క్వాలిఫై కాగా అమ్మాయిలు 86.63 శాతం మంది అర్హత సాధించారు. పాలిటెక్నిక్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సాంకేతిక భవన్లో టెక్నికల్ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్
శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 82.77 శాతం మంది స్టూడెంట్లు క్వాలిఫై అయ్యారు. పాలిసెట్‌కు 1,05,742 మంది స్టూడెంట్లు నమోదు చేసుకున్నారు. ఈ నెల17న జరిగిన పరీక్షకు 98,274 మంది హాజరయ్యారు. దీంట్లో 80,752 మంది (82.77 శాతం) పాసయ్యారు. బాయ్స్ 54,700 మంది అటెండ్ కాగా 43,006 (78.62 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. గర్ల్స్ 43,574 మంది హాజరుకాగా 37,746 (86.63 శాతం) మంది అర్హత సాధించారు. అయితే, ఎస్సీఎస్టీ స్టూడెంట్లకు ఒక్క మార్కు, మిగిలిన అందరికీ 36 మార్కులు వస్తే వారిని క్వాలిఫై చేస్తున్నారు. ప్రతి స్టూడెంట్‌కు ఎంపీసీ, ఎంబైపీసీ ర్యాంకులు కేటాయించారు. ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంకు ద్వారా
పాలిటెక్నిక్ కాలేజీల్లో, ఎంబైపీసీ స్ట్రీమ్ ర్యాంకు ద్వారా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత నవీన్ మిట్టల్ మాట్లాడారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కౌన్సెలింగ్ సెంటర్లలో దరఖాస్తుల ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది మణుగూరు, మహేశ్వరం, షాద్‌నగర్‌లో కొత్తగా పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎంపీసీలో 81.77 శాతం
ఎంపీసీలో 98,274 మందికి 80,358 మంది (81.77 శాతం), ఎంబైపీసీలో 80,752 (82.17 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. మరోపక్క నిబంధనల ప్రకారం ఎస్సీ అభ్యర్థులు 17,093 మందికి 17,091 మంది, ఎస్టీ అభ్యర్థులు మొత్తం 7,861 మంది అర్హత సాధించారు. ఓసీల్లో ఎంపీసీలో 82.46 శాతం, ఎంబైపీసీలో 81.35 శాతం మంది క్వాలిఫై అయ్యారు. పాలిసెట్ ర్యాంకు కార్డులు, ఓఎంఆర్ షీట్లను https://sbtet.telangana.gov.in, https://polycetts.nic.in వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
జూన్ 14 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ రిలీజైంది. రెండు విడుతల్లో అడ్మిషన్లు చేపడుతామని పాలిసెట్ అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. జూన్14 నుంచి 18 వరకు మొదటి దశ అడ్మిషన్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని, ఈ క్రమంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు జూన్ 16 నుంచి 19 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తామన్నారు. 16 నుంచి 21 వరకు ఆప్షన్ల ప్రక్రియ, 25న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. విద్యార్థులు ఈ నెల 29లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఇక ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ జులై 1న ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో ప్రారంభమవుతుందన్నారు. 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, జులై 1 నుంచి 3 వరకు ఆప్షన్లు ఇస్తామన్నారు. జులై 7న ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయిస్తామని వివరించారు. జులై 15 నుంచి క్లాసులు మొదలవుతాయని వెల్లడించారు. అలాగే జులై 7 నుంచి 17 వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు.
