- ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు తరలింపు
- భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి ప్రాంతాల్లో చేపలకు ఇదే ఆహారం
- రెండరింగ్ ప్లాంట్‌కు తీసుకువెళ్లకుండా అక్రమ రవాణా
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంతర్రాష్ట్ర చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను హెచ్ ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు అడ్డుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన దాడుల్లో 90 టన్నుల చికెన్ వ్యర్థాలను, వాటి రవాణాకు వినియోగిస్తున్న 7 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ బృందాలు అంబర్‌పేట్, కుల్సుంపురా, అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని చికెన్ వ్యర్థాల నిల్వ కేంద్రాలపై దాడులు నిర్వహించాయి. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను తరలిస్తున్న 7 వాహనాలను అడ్డుకుని, వాటిలో ఉన్న 90 టన్నుల చికెన్ వ్యర్థాలను సీజ్ చేశారు.
చేపల చెరువులకు ఆహారంగా..
జీహెచ్ఎంసీ పరిధిలో సేకరించే చికెన్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేసేందుకు చెంగిచెర్లలోని రెండరింగ్ కేంద్రానికి తరలించాల్సి ఉంది. అయితే డ్రైవర్లు, నిర్వాహకులు అలా చేయకుండా అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి ప్రాంతాలతో పాటు నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యర్థాలను అక్కడి చెరువుల్లో చేపలకు ఆహారంగా వినియోగించేందుకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై అధికారులు కేసులు నమోదు చేశారు.
పచ్చి చికెన్ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం, చేపలకు చెరువుల్లో ఆహారంగా వినియోగించడం పూర్తిగా నిషేధితమని స్పష్టం చేశారు. చికెన్ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను మనుషులు ఆహారంగా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాద్ పర్యవేక్షణలో హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్ రంజిత్ కుమార్, ఎం అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యులు దాడుల్లో పాల్గొన్నారు.
