కరెంటు బిల్లులపై 9 వేల ఫిర్యాదులు

కరెంటు బిల్లులపై 9 వేల ఫిర్యాదులు

కరెంట్​ బిల్లుల బాదుడుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల్లో డిస్కంలకు వేల సంఖ్యలో కంప్లయింట్స్​ అందాయి. కరెంటు బిల్లులపై ఈమెయిల్, ఫేస్​బుక్, ట్విట్టర్​ ద్వారా ఫిర్యాదు చేసేందుకు డిస్కంలు అవకాశం కల్పించాయి. దీంతో ఒక్క టీఎస్ఎస్​పీడీసీఎల్​ పరిధిలోనే 9 వేలకుపైగా ఫిర్యాదులు ఈ వారం రోజుల్లోనే అందాయి. రీడింగుల్లో తప్పులు, అధికారుల నిర్లక్ష్యం, తక్కువ కరెంటు వాడే వర్గాలకు స్లాబులు మారడంపై బాగా కంప్లయింట్లు వచ్చాయి. ఈమెయిల్​ ద్వారా అత్యధికంగా 7,500, సోషల్​ మీడియా ద్వారా రోజు 150 నుంచి 200 ఫిర్యాదులొచ్చినట్టు తెలిసింది.

ఫిర్యాదులపైనా నిర్లక్ష్యమే

సోషల్‌‌ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆయా ఏరియాల పరిధిలోని సీఎస్‌‌సీలకు పంపిస్తున్నారు. కొన్నింటినీ సీజీఎం రెవెన్యూ, ఈఆర్‌‌వో కేంద్రాల ఏఏవోలకు, అకౌంట్స్‌‌ విభాగాలకు  పంపిస్తున్నారు. అయితే ఈ ఫిర్యాదులను పరిష్కరించడం పైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్‌‌ పరిధిలో నుంచే 90 శాతానికి పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. వీటిలో మెజారిటీ బిల్లు ఎక్కువగా వచ్చినట్లు చేసినవేనని సమాచారం. సైబరాబాద్‌‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌‌ ప్రాంతాల నుంచి  ట్విట్టర్‌‌లో బాగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. కంప్లయింట్లను ఓ విభాగం నుంచి మరో విభాగానికి ఫార్వర్డ్​ చేయడం తప్ప స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. తప్పుడు బిల్లులపై మెమోలు జారీ చేయకపోవడంతో తమను ఎవరూ ఏం చేయలేరనే ధోరణిలో కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రీడింగ్‌‌లోనూ తప్పులే..

కరెంట్ సిబ్బంది రీడింగ్‌‌ తీయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో భారీగా బిల్లులు వస్తున్నాయని యూజర్లు చెబుతున్నారు. చరణ్‌‌జిత్‌‌ సింగ్‌‌ అనే  వ్యక్తికి రీడింగ్‌‌ 3,270 యూనిట్లు కాగా బిల్లులో 9,810 యూనిట్లు వచ్చినట్లు ఉంది. దీంతో   రూ.89,678 బిల్లు వచ్చింది. సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అతను కోర్టు ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది.