కేసీఆర్ ను ప్రజలు కోరుకుంటుండ్రు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

కేసీఆర్ ను ప్రజలు కోరుకుంటుండ్రు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
  • 16  సీట్లిస్తే ఆ లెక్కే వేరు
  • ఆయన బస్సుయాత్రతో బీజేపీ, కాంగ్రెస్​పార్టీల్లో వణుకు
  • బీఆర్ఎస్​పనైపోయిందనుకున్నోళ్లే భయపడుతుండ్రు

హైదరాబాద్/నల్లగొండ: బీఆర్ఎస్​చీఫ్ కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. గోదావరిని తీసుకెళ్లి కావేరిలో కలిపే కుట్రలు మోదీ నేతృత్వంలో మొదలయ్యాయని.. దీన్ని ఆపాలంటే ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్​బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్లగొండ టౌన్​ లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు.  ‘కేసీఆర్‌ పని అయిపోయింది అనుకున్న వాళ్లందరూ ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే భయపడిపోతున్నరు.జరుగుతున్న పరిణామలే బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో స్పష్టం చేస్తున్నయి.

కాంగ్రెస్, బీజేపీలు పక్క రాష్ట్రాల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తయ్. రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీలకు పట్టవు. అందుకే కేసీఆర్ ను ప్రజలు కోరుకుంటున్నరు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు మోదీ సహకరించిండు. ఎంపీ ఎన్నికల్లో మోదీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నడు. గత ఎన్నికల ఫలితాల్లోనూ వీరి కుమ్మక్కు రాజకీయాలు స్పష్టమయ్యాయి. కేసీఆర్​ప్రజలను నమ్ముతాడు. కానీ దేవుళ్ల మీద ఒట్లు వేసి ఒకరు.. దేవుడి పేరుతో ఇంకొకడు ఓట్లు అడుగుతున్నరు. మైనారిటీలను ఓట్ల కోసమే కాంగ్రెస్ వాడుకుంటుంది.  రైతుబంధు ఇవాళ వచ్చిందంటే కేసీఆర్ భయమే కారణం. పార్టీ నుంచి వెళ్లిన నేతలంతా చెట్టుకు చెదలు లాంటి వాళ్లే.  కేసీఆర్ చేతికి 16 సీట్లు అప్పజెప్పితే ఆ లెక్కే వేరు’ అని అన్నారు.