ఐటీ ఉద్యోగులపై ఈ ఏడాది లేఆఫ్‍ల ప్రభావం ఎక్కువే

ఐటీ ఉద్యోగులపై ఈ ఏడాది లేఆఫ్‍ల ప్రభావం ఎక్కువే

ఈ ఏడాది మొదటి 6నెలల్లో ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్‌లు) తక్కువగానే ఉండొచ్చిన నౌకరీ డాట్ కామ్ ఓ సర్వే ద్వారా వెల్లడించింది. కానీ ఐటీ రంగంలో లేఆఫ్ ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. ఈ సర్వేలో1400 మంది రిక్రూటర్లు, కన్సల్టెంట్లు పాల్గొనగా.. సుమారు 10 రంగాలపై సర్వే చేశారు. ఐటీ తర్వాత వ్యాపార అభివృద్ధి, మార్కెటింగ్‌, మానవ వనరులు(హెచ్ఆర్), ఆపరేషన్స్‌ రంగాల్లోని ఉద్యోగులకు ముప్పు పొంచి ఉందని తెలిపింది. అయితే అత్యంత ఎక్కువగా ఈ ముప్పు సీనియర్‌ ఉద్యోగులకు ఉన్నట్టు చెప్పింది. ఈ సర్వేలో పాల్గొన్న 20 శాతం సంస్థలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. కానీ ఉద్యోగాల్లో తాజాగా చేరిన వారికి (ఫ్రెషర్స్‌) మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని పేర్కొంది.

2023 తొలి అర్ధభాగంలో ఉద్యోగుల వలసల రేటు అధికంగా 15 శాతం మేర ఐటీ రంగంలోనే ఉండొచ్చని సర్వే తెలిపింది. 92 శాతం మంది రిక్రూటర్లు ఈ ఏడాది జూన్‌లోపు నియామక కార్యకలాపాలపై ఆశావాదంగానే ఉన్నాయి. కొత్త, రీప్లేస్‌మెంట్‌ (భర్తీ) ఉద్యోగాలు కల్పిస్తామని 50 శాతం సంస్థలు వెల్లడించాయి. కేవలం కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని 29 శాతం సంస్థలు, ఉన్న ఉద్యోగులను యథాతథంగా కొనసాగిస్తామని 17 శాతం సంస్థలు పేర్కొన్నాయి. నియామక సెంటిమెంట్‌ ఆశావాదంతో ఉండటంతో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఆశించొచ్చని 1/3 వంతు పైగా రిక్రూటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సరాసరి ఇంక్రిమెంటు 20 శాతానికి పైగా ఉండొచ్చని భావిస్తున్నారు.