కరోనా నుంచి కోలుకున్న 97 ఏళ్ల వృద్ధుడు

కరోనా నుంచి కోలుకున్న 97 ఏళ్ల వృద్ధుడు

న్యూఢిల్లీ: కరోనా సోకిన 97 ఏళ్ల ఓ వృద్ధుడు వైరస్ బారి నుంచి కోలుకోవడం చర్చనీయాంశం అవుతోంది. మహమ్మారిని జయించొచ్చనే ఆశను కల్పిస్తున్న ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. 1923లో జన్మించిన సదరు పెద్దాయన బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వయస్సు పైబడిన పేషెంట్స్‌లో ఆయన ఒకరుగా నిలిచారు. ఈ విషయంపై గురువారం ఆగ్రా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ మాట్లాడారు. ఏప్రిల్ 29న సదరు వృద్ధుడు లెవల్‌-2 ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. సదరు ముసలాయన కరోనా నుంచి కోలుకోవడం హిస్టారికల్ సిటీ అయిన ఆగ్రాకు గర్వం కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. ‘మా టీమ్ ప్రతి రోజు సదరు పెద్దాయన హెల్త్ కండీషన్‌పై దృష్టి నిలిపేది. కరోనా నుంచి ఆయన కోలుకొని, నెగటివ్‌గా తేలాక మేం చాలా సంతోషించాం. ఆ ముసలాయన వైరస్‌ను జయించడం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది’ అని ప్రభు సింగ్ చెప్పారు. సదరు పెద్దాయనకు హైపర్ టెన్షన్ ఉందని, ఆక్సిజన్ సప్లయి అవసరం ఏర్పడిందని.. అయినా ఆయన రికవర్ అయ్యారని హర్షం వ్యక్తం చేశారు.