పొరుగు దేశాల నుంచి 98 ఎఫ్​డీఐలు వస్తున్నాయ్‌!

పొరుగు దేశాల నుంచి 98 ఎఫ్​డీఐలు వస్తున్నాయ్‌!

న్యూఢిల్లీ: మనదేశంతో సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి 2020 ఏప్రిల్  నుంచి  98 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌డిఐ) ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం 423 ట్రేడింగ్ , ఎలక్ట్రానిక్స్‌‌‌‌  సహా పలు రంగాల నుంచి స్వీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటుకు తెలియజేసింది.   వీటిలో చాలా ప్రతిపాదనలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చైనా నుంచి వచ్చినవే అని వాణిజ్య  పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లోక్‌‌‌‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  2020 ఏప్రిల్ నుంచి భారతదేశ  సరిహద్దు దేశాల నుంచి 423 ఎఫ్‌‌‌‌డిఐ ప్రతిపాదనలను తీసుకున్నామని చెప్పారు. 

ట్రేడింగ్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రెన్యువబుల్​ ఎనర్జీ, ఆర్థిక సేవలు, ఫార్మాస్యూటికల్స్  కెమికల్స్ రంగాల నుంచి అత్యధిక ప్రతిపాదనలు అందాయని ఆయన తెలిపారు. 2020 ఏప్రిల్​లో కరోనా మహమ్మారి తరువాత దేశీయ సంస్థలు పరాయి దేశాల చేతుల్లోకి వెళ్లిపోకుండా అరికట్టడానికి చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల నుంచి విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్  ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాలు.  ఈ దేశాల నుంచి ఎఫ్‌‌‌‌డిఐ ప్రతిపాదనలకు భారతదేశంలో ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతి అవసరం.