రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణిలో ఘటన
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : నడవలేని స్థితిలో ఉన్న ఓ దివ్యాంగుడు తన సమస్య కలెక్టర్కు చెప్పుకోవడానికి ప్రజావాణికి వచ్చాడు. అతడిని చూసిన కలెక్టర్ అనురాగ్జయంతి.. వెంటనే తన సీట్లోనుంచి లేచి అతడి దగ్గరికి వచ్చి సమస్య తెలుసుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగింది. తంగల్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కర్నే సంజీవ్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చాడు. అప్పటికే కలెక్టర్ అనురాగ్ జయంతి స్టేజీపై కూర్చుని వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ దివ్యాంగుడిని చూసిన కలెక్టర్ వెంటనేతన సీట్లో నుంచి లేచి కిందకు వచ్చారు. అతడి దగ్గరకు వెళ్లి ఓపిగ్గా సమస్య తెలుసుకున్నారు. తనకు పుట్టుకతోనే వైకల్యం ఉందని, తన తల్లే తనను పోషిస్తోందని కలెక్టర్ కు చెప్పాడు. పాత ఇంట్లో ఉండే వాళ్లమని, ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిందన్నాడు. ప్లాస్టిక్ కవర్ తో కప్పుకున్న పాత గోడల మధ్య జీవిస్తున్నామని, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. వెంటనే సంబంధిత శాఖధికారికి సమస్య పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. కాగా ప్రజావాణిలో మొత్తం 16 దరఖాస్తులు వచ్చాయి. అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం, శుక్రవారం డ్రైడే నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఇన్చార్జి డి.ఆర్.ఓ శ్రీనివాస్ రావు, వేములవాడ ఆర్డీఓ వి.లీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆఫీసర్లు వస్తలేరు.. అభివృద్ధి పనులు ఎలా ?
జగిత్యాల రూరల్, వెలుగు: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశాలకు ఆఫీసర్లు రావడంలేదని, వచ్చినా తూతూ మంత్రంగా సమావేశం ముగించి వెళుతున్నారని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కలెక్టర్ రవి నాయక్ కు విన్నవించారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జగిత్యాల అర్బన్మండలానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కలెక్టర్కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆగస్టు 6న నిర్వహించిన జగిత్యాల అర్బన్ సర్వసభ్య సమావేశానికి సంబంధిత ఆఫీసర్లు గైర్హాజరయ్యారని తెలిపారు. ఆఫీసర్లు రాకపోతే అభివృద్ధి కుంటు పడుతుందని అన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. సర్పంచులు గొడిసెల గంగాధర్, డెక్క ప్రభాకర్, లక్ష్మణ్ రావు, ఎంపీటీసీలు రొక్కం రాజశేఖర్, దమ్మ మల్లారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఖుద్బుద్దీన్ ఉన్నారు.
కరీంనగర్ లో 188 ఫిర్యాదులు
కరీంనగర్ సిటీ: కరీంనగర్కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 188 దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఈడీ ఎస్పీ కార్పొరేషన్ శాఖకు 60, జిల్లా పంచాయతీకి 6, మిగిలిన శాఖలకు సంబంధించి 122 ఫిర్యాదులు స్వీకరించామని ఆయన పేర్కొన్నారు. వినతులు, ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను అదేశించారు.

