ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగీ ఎంగిడీ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా క్రికెటర్ ఎంగిడీ పరిస్థితి చూసి అదే ఢిల్లీ జట్టులో ఉన్న మరో సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ భావోద్వేగానికి లోనయ్యాడు. స్టేడియంలో కుప్పకూలిన స్థితిలో బాధపడుతున్న ఎంగిడీని చూసి మిల్లర్ ఎంతో చింతించాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మిడ్-ఆఫ్ నుంచి వెనక్కి వస్తూ క్యాచ్ పట్టే ప్రయత్నంలో లుంగి ఎంగిడి తలకు తీవ్ర గాయం కావడంతో కుప్పకూలిపోయాడు. అప్పటిదాకా సందడిగా ఉన్న స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
పాపం ఎంగిడీ ఎంత తీవ్రంగా గాయపడ్డాడంటే.. అతని కింద పడి తిరగబడటంతో అతని శరీరం బరువు మొత్తం మెడపై.. మరీ ముఖ్యంగా తలపై పడింది. దీంతో.. మెడ మీద నరాలపై బాగా ఒత్తిడి పడింది. తల లోపల తీవ్ర గాయమైంది. లుంగీ ఎంగిడీని స్టేడియం నుంచి ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన గంటన్నర తర్వాత.. ఆ పేసర్ పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ కానున్నాడని అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఢిల్లీ బౌలింగ్ చేస్తుండగా.. అక్షర్ పటేల్ వేసిన మూడవ ఓవర్‌లో ప్రియాన్ష్ ఆర్య షాట్ కొట్టాడు. ఎంగిడి క్యాచ్కు యత్నించి బంతిని అందుకోలేక వెనక్కి పడిపోయాడు. అతని తల నేలకు బలంగా తగలడంతో, అతను వెంటనే నొప్పితో తల పట్టుకున్నాడు. ఫిజియోథెరపిస్టులు అతనికి గ్రౌండ్లోనే చికిత్స అందిస్తుండటంతో ఆట చాలాసేపు నిలిచిపోయింది. ఎంగిడి నేలపైనే పడి ఉండటంతో, స్ట్రెచర్‌ను పిలిపించారు. కానీ.. గాయం తీవ్రత కారణంగా అంబులెన్స్ మైదానంలోకి రావాల్సి వచ్చింది. వైద్య బృందం అతడిని మెల్లగా స్ట్రెచర్‌పైకి ఎక్కించి, స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు.

