కేరళలో గత కొద్ది రోజులు కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి.. ఊర్లకు ఊర్లే మునిగిపోవడంతో ఇప్పటికే 15 మందికి పైగా చనిపోగా.. 7 మంది గల్లంతయ్యారు. అయితే కేరళలో మరో దఫా వర్షాలు కురిసే అవకాశం ఉందని 2026 ఆగస్టు 6న వాతావరణ కేంద్రం తెలిపింది. డాల్ఫిన్ తుఫాన్ కారణంగా మరోసారి కేరళకు వాన ముప్పు ఉన్నట్లు తెలిపింది.
పసిఫిక్ మహాసముద్రంలో, చైనాలో ఏర్పడిన డాల్ఫిన్ తుఫాన్ ప్రభావంతో కేరళలో వర్షాలు మరింతగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆగస్టు 8 (శనివారం) శక్తివంతమైన తుఫాన్ చైనాను తాకనుందని అంచనా వేస్తున్నారు. భూమిపై తుఫాన్ బలహీన పడితే కేరళను పట్టి పీడిస్తున్న భారీ వర్షాలు తగ్గే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఫిలిప్పీన్స్ సమీపంలో ఉన్న కుజ్రా తుఫాన్ కూడా కేరళకు ప్రమాదకరంగా మారవచ్చునని అంటున్నారు.
టైఫూన్ లు తక్కువ పీడనంపై పనిచేస్తూ.. వాతావరణంలో ఉన్న తేమను పీల్చుకుని విజృంభిస్తాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు తూర్పు వైపు కదులుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో తుఫాను కేంద్రాలుగా మారుతాయి. కేరళ తీరం నుంచి పశ్చిమ కనుమల వరకు విస్తరిస్తూ.. అతిపెద్ద వర్షపాతానికి కారణమవుతాయి.
డాల్ఫిన్ తుఫాన్.. అసాధారణ తుఫానుగా మారి విధ్వంసం సృష్టించింది. జులై 27న ఏర్పడి.. జులై 29 వరకు సూపర్ టైఫూన్ గా మార్పు చెందింది. గాలి వేగం గంటకు 165 కిమీ కు చేరుకుంది.
దీనికి తోడు స్థానిక పీడన ప్రభావంతో రుతుపవన వర్షపాతాలు తీవ్రంగా మారుతున్నాయి. తుఫాను ప్రభావం ప్రస్తుతం దక్షిణ కర్ణాటక, దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరి. బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతాలపై విస్తరించి ఉన్నట్లు వాతవరణ కేంద్రం చెబుతోంది.
ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఆదివారం (ఆగస్టు 09) వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
