వికారాబాద్: వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలో అమానుష ఘటన జరిగింది. వరుసకు చెల్లెలని కూడా చూడకుండా సాకేత్ అనే యువకుడు బలవంతపు వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులు భరించలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం నాసన్ పల్లి గ్రామంలో జనార్దన్, సావిత్రి దంపతులకు కూతురు ఉంది.
నవాబ్ పేట్ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి పరీక్షలు పూర్తిచేసుకుని ఇంటికి వెళ్లింది. ఈ అమ్మాయిని కొన్ని రోజులుగా ఇదే గ్రామానికి చెందిన సాకేత్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఎందుకు తనతో మాట్లాడటం లేదని బలవంతంగా వేధించసాగాడు.
మత్తుకు బానిసైనా సాకేత్ వరసకు చెల్లెలు అయినా కూడా ఆమెను వదల్లేదు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్లి వేధించాడు. తనకు అన్న వరుస అవుతావని ఆ అమ్మాయి గుర్తుచేసినా సాకేత్ పట్టించుకోలేదు. కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా కూడా వదల్లేదు.
ఈ దారుణం గురించి ఎవరికీ ఏం చెప్పుకోలేక పురుగుల మందు తాగి అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ అమ్మాయి ఆత్మహత్య తర్వాత సాకేత్ పరారీలో ఉన్నాడు. సాకేత్ అనే యువకుడు డీజే నడుపుతూ మత్తుకు బానిసయ్యాడని గ్రామస్తులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

