V6 News

వైభవ్ 'సూర్య' తాండవం: జైపూర్‌లో పరుగుల సునామీ.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

వైభవ్ 'సూర్య' తాండవం: జైపూర్‌లో పరుగుల సునామీ.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

SRH vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు కొనసాగింది. మొదటి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాయల్స్ కి ఆశించిన ఆరంభం లభించలేదు.. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 10 పరుగులు చేసి ఎషాన్ మలింగ బౌలంగ్ లో అవుట్ అయ్యాడు. అనంతరం వైభవ్ సూర్యవంశీ మాత్రం అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ, కేవలం 36 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసుకుని సన్‌రైజర్స్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు.

మరోవైపు, ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సుతో 51పరుగులు) దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్(12.5 ఓవర్లో)లో పెవిలియన్ కి చేరుకున్నాడు. ఇక 170 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులతో 103 పరుగులు) కూడా సాకీబ్ హుస్సేన్ బౌలింగ్(13.5 ఓవర్లో)లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి విఫలమయ్యాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ కావడంతో కేవలం 7 పరుగుల మాత్రమే చేసిన మైదానం వీడాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన డోనోవన్ ఫెరీరా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో ఎషాన్ మలింగ బౌలింగ్ లో హెన్రిచ్ క్లాసెన్ కి క్యాచ్ ఇచ్చి ఫెరీరా (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో (33) పెవిలియన్ కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్‌మయర్ (11) పెద్దగా ఆకట్టుకోలేదు.. త్వరగానే డకౌట్ కి వెళ్లిపోగా, చివర్లో రవీంద్ర జడేజా, జోఫ్రా అర్చర్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది రాజస్థాన్. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీసుకోగా, ప్యాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, ప్రపుల్ హింగే, నితిష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.