V6 News

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి... ఏడుగురికి తీవ్ర గాయాలు..

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి... ఏడుగురికి తీవ్ర గాయాలు..

ఏపీలోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఏప్రిల్ 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..గాజువాకలోని తుంగ్లమ్ దగ్గర రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణ పనులు చేస్తుండగా పరంజా ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పిల్లర్ల మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గాయపడిన వారిని బుద్ధిశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుసర్, ప్రతాప్, ఉదయ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు అధికారులు.

ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది కూలీలు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కూలీలు భోజనానికి వెళ్లడంతో ప్రాణనష్టం తప్పిందని అంటున్నారు.దీంతో పాటు ఆదివారం కూడా కావడంతో చాలామంది కూలీలు పనికి రాలేదని..లేదంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని అంటున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జి కింద నుంచి వాహనాలేమైనా వెళ్లాయా.. వాహనదారులు ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో గాలిస్తున్నారు పోలీసులు. నిర్మాణ పనుల్లో లోపం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు అధికారులు.