పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లివ్వండి.. రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్

పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లివ్వండి.. రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాయలసీమలో తాగునీటి ఎద్దడిని తీర్చడంతోపాటు ఆరుతడి పంటలకు నీళ్లిచ్చేలా శ్రీశైలం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్​ చేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదలను మొదలుపెట్టాలని కోరుతూ నంద్యాల జాయింట్​ కలెక్టర్, ఇరిగేషన్​ అధికారులకు సమితి ఉపాధ్యక్షుడు ఏరువ రామచంద్రారెడ్డి, యర్రం శంకర్​రెడ్డి నేతృత్వంలోని నాయకులు వినతిపత్రం అందజేశారు.

నిరుడు శ్రీశైలం రిజర్వాయర్‌‌కు 2,000 టీఎంసీలకుపైగా వరద వచ్చినా.. విద్యుదుత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల క్యారీ ఓవర్​ నీటిని ఉంచలేకపోయారన్నారు. దానివల్లే ప్రస్తుతం సాగు, తాగునీటి సంక్షోభం ఎదురవుతున్నదన్నారు.

ఎగువన కర్నాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి వరద వస్తున్నదని, పోతిరెడ్డిపాడు ద్వారా, ఎస్ఆర్​బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులతో లింక్​ ఉన్న బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్లు, చెరువులను నీటితో నింపాలన్నారు.