కరీంనగర్ జిల్లా ఖాన్పురాలో సెలూన్ వర్కర్ పై ఎస్సై దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఎస్సై చైతన్య చందర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీపీ గౌస్ ఆలం.
కరీంనగర్ నగరంలోని ఖాన్ పురాలో త్రీటౌన్ ఎస్సైగా పని చేస్తున్న చైతన్య చందర్ స్థానిక సెలూన్ షాపుకు వెళ్లారు. అక్కడ పని చేసే రాము అనే వర్కర్, మర్యాదగా కూర్చో అన్నా అని పిలవడమే అతను చేసిన నేరమైపోయింది.నన్నే అన్నా అంటావురా..? అంటూ ఊగిపోయిన ఎస్సై.. అధికార మదంతో రాముపై విచక్షణారహితంగా దాడికి దిగాడు.
గౌరవంగా పిలిచినందుకు ప్రతిఫలంగా పిడిగుద్దులు కురిపించాడు. సెలూన్ షాపులోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా సామాన్యులపై దాడికి దిగడంపై స్థానికులు మండిపడుతున్నారు.
వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సామాన్య పౌరుడిపై దాడి, అధికార దుర్వినియోగం చేసినట్లు నివేదికలో నిర్దారించారు అధికారులు. పోలీస్ శాఖ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు.

