శనివారం (ఆప్రిల్ 25 ) రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ (జర్నలిస్టుల విందు) కార్యక్రమంలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కోల్ టోమాస్ అలెన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఫాక్స్ న్యూస్ కాలమిస్ట్ కరోల్ మార్కోవిచ్ నిందితుడి వివరాలను బయటపెట్టారు. నిందితుడు 31 ఏళ్లు కోల్ టోమాస్ అలెన్... కాలిఫోర్నియాలోని టోరెన్స్ నివాసి. అతను కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాడని, గతంలో నాసా (NASA)లో రీసెర్చ్ ఫెలోగా పనిచేశాడని సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, లాస్ ఏంజిల్స్ కౌంటీలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా అందుకున్నట్లు సమాచారం.
అతను డెమోక్రాట్ పార్టీ మద్దతుదారుడని, కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి విరాళం ఇచ్చాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఘటన ఎలా జరిగింది?
విందు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఐదు నుండి ఎనిమిది సార్లు కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు రంగంలోకి దిగి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
భద్రతా సిబ్బంది చాలా వేగంగా స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు. అందరూ క్షేమంగా ఉన్నారు," అని ట్రంప్ 'ట్రూత్ సోషల్ ద్వారా తెలిపారు. ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే కరోలిన్ లీవిట్ అనే వ్యక్తి 'కాల్పులు జరుగుతాయి' అని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ దాడి ప్రయత్నం తర్వాత జర్నలిస్టుల విందు కార్యక్రమాన్ని రద్దు చేశారు. వాషింగ్టన్ మేయర్ సహా బౌసర్, పోలీస్ అధికారులు హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విందు కార్యక్రమాన్ని మళ్ళీ 30 రోజుల్లోగా నిర్వహిస్తామని ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం అధికారులు నిందితుడిని విచారిస్తున్నారు.

