ముందు ఫ్రీ ట్రాన్స్ ఫోర్ట్ అని.. ఇప్పుడు పైసలు అంటున్రు

ముందు ఫ్రీ ట్రాన్స్ ఫోర్ట్ అని.. ఇప్పుడు పైసలు అంటున్రు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌‌కు హాజరైన లెక్చరర్లకు ఇచ్చే రెమ్యునరేషన్‌‌లో కోత పడనుంది. ముందు ఫ్రీగా ట్రాన్స్​పోర్టు సౌకర్యం కల్పిస్తామని చెప్పిన అధికారులు… ఇప్పుడు బస్ చార్జీలను లెక్చరర్ల నుంచే వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఎంత శాతమనేది ఇంకా నిర్ణయించలేదు. స్పాట్ వాల్యుయేషన్ మొదటి సబ్జెక్ట్​ పూర్తై 2 వారాలవుతున్నా లెక్చరర్లకు రెమ్యునరేషన్ అందలేదు. ఇంటర్ బోర్డు అధికారులు జిల్లాలకు ఇప్పటికే ఫండ్​రిలీజ్ చేశారు. గతంలో సబ్జెక్ట్​ స్పాట్​ పూర్తైన రోజే వాళ్ల ఖాతాలో రెమ్యునరేషన్​ పడేది. అయితే, బస్సు చార్జీల కోసమే చెల్లించలేదని తెలుస్తోంది. అధికారుల తీరుపై లెక్చరర్లు గుర్రుగా ఉన్నారు.

రూ.2 కోట్ల బిల్లు

మే 12 నుంచి ప్రారంభమైన ఇంటర్​ స్పాట్​ మే 30తో ముగిసింది. దీంట్లో 15 వేల మంది వరకు లెక్చరర్లు పాల్గొన్నారు. అయితే స్పాట్​కు వచ్చే లెక్చరర్లకు ఫ్రీ ట్రాన్స్ పోర్టుతో పాటు సబ్సిడీపై ఫుడ్ అందిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు మొదట ప్రకటించారు. హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ బస్సుల ద్వారా ఉమ్మడి జిల్లా కేంద్రాలకు లెక్చరర్లను తరలించారు. ఒక్కో బస్సులో 25 మంది చొప్పున తీసుకెళ్లారు. వీటిని స్పెషల్ ట్రిప్పులుగా లెక్కేసిన ఆర్టీసీ… రూ.2.07 కోట్ల బిల్లు వేసింది. ఇది చూసి షాక్​ అయిన అధికారులు, చార్జీలను లెక్చరర్ల నుంచే వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఓ ఆఫీసర్‌‌ కొర్రీలు…

లెక్చరర్లకు సబ్సిడీపై ఫుడ్ అందించకలేకపోయాం కాబట్టి, చార్జీలు బోర్డు భరించాలని ఉన్నతాధికారులు భావించారు. కానీ, పరీక్షల విభాగంలోని ఓ ఉన్నతాధికారి దీనికి కొర్రీలు పెట్టినట్టు బోర్డులో చర్చ జరుగుతోంది. బోర్డు సెక్రటరీని సైతం ఆ ఆఫీసర్ తప్పుదోవ పట్టించారని అంటున్నారు. మరోవైపు వాల్యుయేషన్ ప్రారంభమైన రెండో రోజే బస్ చార్జీలు వసూలు చేస్తామని చెప్పినట్టు బోర్డు సెక్రటరీ ఉమర్​జలీల్ చెప్పారు. ఎంత మొత్తం కట్ చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.