లెఫ్ట్ సపోర్ట్.. కాంగ్రెస్​కు బూస్టింగ్

లెఫ్ట్ సపోర్ట్.. కాంగ్రెస్​కు బూస్టింగ్

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం వామపక్ష పార్టీలను కలుపుకునిపోవాలని నిర్ణయించింది. కామ్రేడ్లతో దోస్తీతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. అదే జోరును లోక్ సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లలో కాంగ్రెస్ కు మద్దతిస్తామని సీపీఐ ఇదివరకే ప్రకటించగా.. భువనగిరిలో మినహా మిగతా 16 చోట్ల మద్దతిస్తామని తాజాగా సీపీఎం కూడా తేల్చింది. దీంతో లెఫ్ట్ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరనుంది. 

లెఫ్ట్ లిఫ్ట్​తో బూస్టింగ్ 

రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సీపీఎం, సీపీఐ పార్టీలకు ఓటు బ్యాంకుతో పాటు కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్లలో వామపక్షాల ప్రభావం ఉంది. సింగరేణి కోల్ బెల్ట్​లోనూ లెఫ్ట్ పార్టీలకు ఆదరణ ఉంటుంది. అందుకే ఎంపీ ఎన్నికల్లోనూ లెఫ్ట్ పార్టీల మద్దతును కాంగ్రెస్ కోరింది. లోక్ సభ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అయినా లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కు లిఫ్ట్ ఇస్తే బూస్టింగ్ లభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల నుంచి అదే ట్విస్ట్  

అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌‌, సీపీఎం మధ్య పొత్తుపై చివరి వరకూ డైలమా కొనసాగింది. కానీ చివరి దశలో కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. 5 సీట్లు అడిగితే 2 ఇస్తామని చెప్పి, చివరకు ఒక సీటుకు పరిమితం చేయడంతో అప్పుడు సీపీఎం ఒంటరి పోరు కొనసాగించింది.19 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిచింది. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని స్థానాల్లో బీఆర్‌‌ఎస్‌‌కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌‌కు సీపీఎం మద్దతు పలికింది.  సీపీఐ మాత్రం గత ఎన్నికల్లో ఒక సీటులో పోటీ చేసి కొత్తగూడెం నుంచి గెలిచింది. ఇప్పుడు ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌‌కు మద్దతిస్తోంది. మరోవైపు పార్టీకి కనీస ఓట్లు సాధించాలన్న భావనలో సీపీఎం ఉన్నట్లు తెలుస్తోంది. 

సర్దిచెప్పిన సీఎం రేవంత్ 

కేరళ పర్యటనలో సీఎం పినరయి విజయన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సీపీఎం నేతలు గుర్రుగా ఉన్నారు. ఆ అంశంపై సీఎం రేవంత్ వివరణ ఇస్తూ కేరళ పర్యటనలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీ ఉన్నందున అక్కడ పార్టీ విధానానికి తగ్గట్టుగా మాట్లాడానని సర్దిచెప్పినట్టు తెలిసింది. ఆ అంశాన్ని పక్కన పెట్టి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపునకు సీపీఎం సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భువనగిరి నుంచి తప్పుకోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనిని ఆయన కోరారు. కానీ పార్టీలో చర్చించుకుని చెప్తామ న్నారు. భువనగిరిలో సీపీఎం పోటీలోనే కొనసాగాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. భువనగిరి మినహా మిగతా స్థానాల్లో మద్దతునిచ్చేందుకు ఓకే చెప్పింది.