ఎంత పని చేశార్రా..కదులుతున్న వ్యాన్లో మహిళపై గ్యాంగ్ రేప్ ..రోడ్డుపై విసిరేసి పరారైన దుండగులు

ఎంత పని చేశార్రా..కదులుతున్న వ్యాన్లో  మహిళపై గ్యాంగ్ రేప్ ..రోడ్డుపై విసిరేసి పరారైన దుండగులు
  •     ఫరీదాబాద్​లో నిర్భయ తరహా ఘటన
  •     ఫ్రెండ్​ను కలిసి రాత్రి ఇంటికి బయల్దేరిన మహిళ
  •     ఆటో కోసం వెయిట్ చేస్తుండగా వ్యాన్​లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు
  •     డ్రాప్​ చేస్తామని నమ్మించి వ్యాన్ ఎక్కాక అత్యాచారం
  •     ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్​లో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలో 28 ఏండ్ల మహిళ గ్యాంగ్​రేప్​కు గురైంది. ఆమెను కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు.. కదులుతున్న వ్యాన్​లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. 

2 నుంచి 3 గంటల తర్వాత ఆమెను బయటికి విసిరేసి పరార్ అయ్యారు. దీంతో బాధితురాలి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. వ్యాన్​ను సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

ముగ్గురు పిల్లలతో కలిసి పేరెంట్స్ వద్దే...

బాధిత మహిళకు పెండ్లి అయింది. కుటుంబ గొడవల కారణంగా భర్తకు దూరంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. సోమవారం రాత్రి 8 గంటలకు బాధితురాలు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. సుమారు 11.30  గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఫరీదాబాద్‌‌లోని మెట్రో చౌక్ వద్దకు వచ్చింది. అక్కడ ఆటో కోసం ఎదురుచూస్తుండగా ఓ వ్యాన్​ ఆమె దగ్గర్లో ఆగింది. 

ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఇంట్లో దింపుతామని నమ్మించారు. దీంతో బాధితురాలు వ్యాన్​లోకి ఎక్కింది. ఆ తర్వాత నిందితులు వ్యాన్​ను గుర్గావ్ రోడ్​వైపు మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కదులుతున్న వ్యాన్‌‌లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల వరకు రేప్ చేశారు. ఆ సమయంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బాధితురాలు కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు.

ముఖంపై 10 నుంచి 12 కుట్లు

ఫరీదాబాద్ ఎస్​జీఎం నగర్​లోని రాజా చౌక్ వద్ద రన్నింగ్ వ్యాన్ నుంచే బాధితురాలిని నిందితులు బయటికి విసిరేశారు. దీంతో ఆమె ముఖం, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒళ్లంతా రక్తంతో నిండిపోయింది. ఆ తర్వాత బాధితురాలు తన చెల్లెకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె.. చినిగిపోయిన బట్టలతో ఉన్న తన సోదరిని సిటీ సివిల్ హాస్పిటల్​కు తీసుకెళ్లింది. పరీక్షించిన డాక్టర్లు.. ఆమె ముఖంపై 10 నుంచి 12 కుట్లు వేశారు. 

బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్ కోట్వాలీ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకరు యూపీ, మరొకరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఫరీదాబాద్​లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. కాగా, బాధితురాలు ప్రస్తుతం హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, మానసికంగా దిగ్భ్రాంతికి లోనైనట్లు డాక్టర్లు తెలిపారు.