45 మందిని కరిచిన పిచ్చి కుక్క

45 మందిని కరిచిన పిచ్చి కుక్క

రాడ్లు, రాళ్లు, కర్రలతో కొట్టి కుక్కను చంపిన యువకులు

హైదరాబాద్/ఖైరతాబాద్, వెలుగుఎక్కడి నుంచొచ్చిందో ఏమో.. బయట గల్లీలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని కరిచేసింది ఓ పిచ్చి కుక్క. కాళ్లు, చేతులు, మొహంపై తీవ్రగాయాలు చేసింది. అంతలోనే పక్కింటామె వచ్చి కుక్కను తరిమి చిన్నారిని కాపాడింది. అంతకుముందే ఆమెనూ ఆ కుక్క కరిచింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 45 మందిపై దాడి చేసిందా కుక్క. కనిపించిన వాళ్లను కనిపించినట్టే కరిచింది. దీంతో ఆ కుక్కను వెతుక్కుంటూ వెళ్లి దాన్ని చంపేశారు కొందరు యువకులు. మంగళవారం హైదరాబాద్​లోని అమీర్​పేట ధరంకరం రోడ్​లో జరిగిందీ ఘటన. అక్కడి బస్తీలో వివేకానంద కమ్యూనిటీ హాల్​లో అంగన్​వాడీ ఆయా సుజాత (45) అనే మహిళపై మధ్యాహ్నం కుక్క దాడి చేసింది. ఆ పక్క వీధిలో ఉండే నేతల రాఘవి (6) అనే చిన్నారిని మధ్యాహ్నం 2 గంటల టైంలో తీవ్రంగా కరిచింది. పాప అరుపులు విన్న భారతమ్మ అనే మహిళ వచ్చి చుట్టుపక్కలోళ్లను పిలిచి కుక్కను తరిమింది.

ఆ చిన్నారిపై కుక్క దాడి చేసిన ఘటన అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళితే, సీరియస్​గా ఉందని చెప్పి పెద్దాస్పత్రికి పంపించారు. దాన్ని వదిలేస్తే ఇంకెంతమందిపై దాడి చేస్తుందోనన్న ఆందోళనతో ఆ కుక్కను చంపాలని బస్తీ యువకులు డిసైడ్​ అయ్యారు. దాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఈ క్రమంలో సత్యం థియేటర్​కు దగ్గర్లో ఆ కుక్క కనిపించింది. ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో ఆ కుక్కను కొట్టి చంపారు. అప్పటికే ఆ కుక్క 45 మందిని కరిచింది. కుక్కల గురించి జీహెచ్​ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బస్తీ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ ఏరియా నుంచి ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​ తెలిపారు. దాడి చేసిన కుక్క ఆ ప్రాంతానికి చెందినది కాదన్నారు. చనిపోయిన కుక్కను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుక్కల ప్రవర్తనపై వెటర్నరీ విభాగాన్ని అలర్ట్​ చేశామన్నారు. కుక్కల్లో విపరీత ప్రవర్తనను గమనిస్తే వెంటనే సమాచారమివ్వాలని ఆయన సూచించారు.

see also: రైతుబంధు 10 ఎకరాల లిమిట్ పెట్టే ప్లాన్