- కలెక్టర్‌కు గోడు వినిపించిన వృద్ధురాలు
కరీంనగర్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలి సమస్యను జిల్లా కలెక్టర్ తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన బొల్లం మల్లవ్వ తన కొడుకులు తిండి పెట్టకుండా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌కు వచ్చింది.
ఆటోలో నుంచి దిగిన తర్వాత ఆడిటోరియంలో జరిగే ప్రజావాణికి వెళ్లే స్థితిలో లేక బయటే ఉండగా, అటుగా వెళ్తున్న కలెక్టర్ చిత్రా మిశ్రా ఆమెను గమనించారు. వృద్ధురాలి వద్దకు వెళ్లి సమస్యను అడిగారు. తన కొడుకులు పట్టించుకోవడం లేదని, భోజనం కూడా పెట్టడం లేదని మల్లవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. అధికారులు మాదాపూర్ గ్రామానికి వెళ్లి మల్లవ్వ కొడుకులకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు.
