అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. 10 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుంది. ఈ క్రమంలో రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్ ను బలంగా ఢీకొట్టడంతో బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కొందరు ప్రయాణికులు బస్సు కిటీకిలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల హాహాకారాలు, ఆక్రందనలు, మంటలతో ఘటన స్థలం భీతావాహంగా మారింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
