- ప్రజాస్వామ్యానికి, ప్రతిపక్షానికి ఇది పెద్ద విజయం అని కామెంట్
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ సమాఖ్య స్వరూపాన్ని మార్చేందుకు కేంద్రం పన్నిన కుట్ర భగ్నమైందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. లోక్‌సభలో శుక్రవారం మహిళా కోటా చట్టాన్ని సవరించే బిల్లు వీగిపోవడం ప్రతిపక్షాల ఐక్యతకు, ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయమని ఆమె స్పష్టం చేశారు. అధికార పక్షం తొలిసారి ఓటమిని చవిచూసిందని, ఈ విషయం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఏప్రిల్17 ఎన్డీయే సర్కారుకు చీకటి రోజు అని ఆమె పేర్కొన్నారు.
శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రతిపక్షం వ్యతిరేకం కాదని.. 2023 చట్టం ద్వారా మహిళల హక్కులను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుత లోక్‌సభ బలంతో ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల చట్టం 2023ను అమలు చేస్తే దానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. శాశ్వతంగా అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిందని, ప్రభుత్వ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహించారని ఆమె అన్నారు. 2029 ఎన్నికల్లో తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ బిల్లును వాడుకోవాలని చూసిందని ఆరోపించారు.
‘‘శుక్రవారం లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ చాలా ఏండ్లపాటు అధికార పక్షంలో కూర్చోలేదని అన్నారు. అది వారి కుటిల మనస్తత్వాన్ని చూపిస్తుంది. శాశ్వతంగా అధికారంలో ఉండటానికే ఈ కుట్ర అంతా జరిగింది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేయకపోతే, అధికారంలో కొనసాగడం కోసం 2029కి ముందు అది జరగదని వారు భావించారు.
ప్రభుత్వం తన ఇష్టానుసారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేసి ఉండేది” అని ప్రియాంక పేర్కొన్నారు. ‘బిల్లు పాస్ అయితే ఫర్వాలేదు. విఫలమైతే.. ప్రతిపక్షాన్ని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించి, మహిళల రక్షకులుగా మారతామని వారు భావించారు. కానీ హత్రాస్‌లో మహిళలకు, మన ఒలింపిక్ పతక విజేతలకు, ఇతరులకు ఏమి జరిగిందో మనం చూశాం" అని ప్రియాంక అన్నారు.

