ఇక దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది: అభిజీత్ దీప్కే

ఇక దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది: అభిజీత్ దీప్కే

ఢిల్లీ: ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’లో నిరసనలపై నిషేధం విధించడంపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఘాటుగా స్పందించారు. ‘అవును.. జంతర్ మంతర్ ప్రాంతాన్ని నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించారు.. ఇకపై అది నిరసన స్థలం కాదు, ఎందుకంటే పిరికి నియంత దానిని యుద్ధ క్షేత్రంగా మార్చేశాడు.. ఇక దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’ అని అభిజీత్ దీప్కే ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.

ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ శాంతియుత నిరసనలకు వేదికగా ఉండేది. ఇకపై ఈ ప్రాంతంలో నిరసనలకు ఆస్కారం లేదని స్పష్టం చేస్తూ.. ‘జంతర్ మంతర్’ ప్రాంతాన్ని నిరసనలు తెలిపేందుకు అనుమతి ఉన్న ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ పోలీసుల సర్క్యులర్ ప్రకారం.. పౌరులు శాంతియుత నిరసనలు తెలిపేందుకు ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా.. జంతర్ మంతర్‌ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుంచి తొలగించారు. నిరసనల కోసం కొత్తగా గుర్తించిన మూడు వేదికలను కమిటీ సిఫార్సు చేసింది. 

రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, షాదారాలోని సీబీడీ గ్రౌండ్లో నిరసనలు తెలిపేందుకు అనుమతి ఉన్న స్థలాలుగా పేర్కొంది. మూడు వేదికల దగ్గర నిరసనలు తెలిపేందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడివిడిగా జారీ చేస్తామని సర్క్యులర్‌లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీక్ విషయంలో.. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకు దారితీసిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు జంతర్ మంతర్ వేదికగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, యువత నుంచి ఈ నిరసనలకు భారీ మద్దతు రావడంతో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయక తప్పలేదు. వేల మంది రోజుల తరబడి జంతర్ మంతర్ దగ్గరే నిరసన తెలిపారు. నిరసనకారులకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ప్రజలు ఫుడ్ ఆర్డర్ చేశారు.

ALSO READ : ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం: జంతర్ మంతర్‎లో ఇకపై నిరసనలు నిషేధం

సోషల్ మీడియా జంతర్ మంతర్ నిరసనలతో హోరెత్తిపోయింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఇదే తరహా నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ, విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే.. జంతర్ మంతర్ ప్రాంతంలో నిరసనలకు అనుమతి లేదని, ఇకపై జంతర్ మంతర్ నిరసనలు తెలిపే ప్రదేశం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.